భారత్‌ బాణం బంగారం.. ఈ పతకం ఎంతో ప్రత్యేకం

5 Aug, 2023 03:58 IST|Sakshi

ప్రపంచ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం

చరిత్ర సృష్టించిన జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్‌ కౌర్‌ బృందం

మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో విశ్వవిజేతగా భారత్‌  

బెర్లిన్‌లో భారత మహిళల బృందం అద్భుతం చేసింది. గతంలో ఎవరికీ సాధ్యంకాని  ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణిత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు ప్రపంచ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తొలిసారి దేశానికి స్వర్ణ పతకాన్ని అందించి కొత్త చరిత్రను లిఖించింది.

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీలు 1931లో మొదలుకాగా భారత ఆటగాళ్లు మాత్రం 1981 నుంచి ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్నారు. తాజా పసిడి పతక ప్రదర్శనకంటే ముందు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 11 పతకాలురాగా అందులో తొమ్మిది రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. ఈ పతకాల  సరసన తొలిసారి పసిడి పతకం వచ్చి చేరింది. 

బెర్లిన్‌ (జర్మనీ): ఎట్టకేలకు భారత ఆర్చరీ పసిడి కల నెరవేరింది. ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో ఎంతోకాలంగా ఊరిస్తున్న స్వర్ణ పతకం మన దరి చేరింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి, పంజాబ్‌ క్రీడాకారిణి పర్ణీత్‌ కౌర్‌ బాణాల గురికి భారత్‌ ఖాతాలో బంగారు పతకం వచ్చింది. శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి, పర్ణిత్‌లతో కూడిన భారత జట్టు 235–229 పాయింట్ల తేడాతో డాఫ్ని  క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్‌ జియోన్, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై గెలిచి విశ్వవిజేతగా అవతరించింది.

2017, 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఫైనల్‌ చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకోగా... మూడో ప్రయత్నంలో మాత్రం పసిడి స్వప్నాన్ని సాకారం చేసుకుంది. భారత బృందం స్వర్ణం నెగ్గడంలో సీనియర్‌ జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. తొమ్మిదోసారి ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తోంది.  మెక్సికోతో జరిగిన ఫైనల్లో భారత జట్టు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నాలుగు సిరీస్‌లలోనూ పైచేయి సాధించింది.

ఒక్కో సిరీస్‌లో జట్టులోని ముగ్గురు సభ్యులు రెండు బాణాల చొప్పున మొత్తం ఆరు బాణాలు సంధిస్తారు. తొలి సిరీస్‌లో భారత్‌ 59–57తో, రెండో సిరీస్‌లో 59–58తో... మూడో సిరీస్‌లో 59–57తో.. నాలుగో సిరీస్‌లో 58–57తో ఆధిక్యం సంపాదించి చివరకు 235–229తో విజయం సాధించింది.  

నేడు జరిగే వ్యక్తిగత విభాగం నాకౌట్‌ దశ మ్యాచ్‌ల్లో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి పోటీపడనున్నారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో పర్ణిత్‌తో జ్యోతి సురేఖ, సాన్‌ డి లాట్‌ (నెదర్లాండ్స్‌)తో అదితి ఆడతారు. గెలిస్తే జ్యోతి, అదితి సెమీఫైనల్లో తలపడతారు. 

12  ప్రపంచ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నెగ్గిన మొత్తం పతకాలు. ఇందులో ఒక స్వర్ణం, తొమ్మిది రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.   

ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జ్యోతి సురేఖ గెలిచిన మొత్తం పతకాలు. 2021లో మహిళల కాంపౌండ్‌ టీమ్, మిక్స్‌డ్‌ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో 3 రజత పతకాలు. 2017లో మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో ఒక రజతం. 2019లో మహిళల టీమ్‌ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో 2 కాంస్య పతకాలు... 2023లో మహిళల టీమ్‌ విభాగంలో ఒక స్వర్ణం.  

ఈ పతకం ఎంతో ప్రత్యేకం 
ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో వచ్చాం. గతంలో రజత, కాంస్య పతకాలు గెలిచా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని పసిడి పతకాలు సాధిస్తాం. తొలి స్వర్ణం కావడంతో ఈ పతకం నాతోపాటు నా సహచరులకు ఎంతో ప్రత్యేకం.

ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పలు పతకాలు నెగ్గినా స్వర్ణం మాత్రం దక్కలేదు. ఈసారి బంగారు పతకం సాధించడంతో ఎంతో ఆనందంగా ఉన్నాను. నేడు వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్నాను. ఇందులోనూ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం. నేనీస్థాయికి చేరుకోవడానికి ఎల్లవేళలా మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.   –జ్యోతి సురేఖ 

మరిన్ని వార్తలు