ఇజ్జత్‌ లేదు.. ఏం లేదు.. కేవలం డబ్బే కావాలి.. ఛీ యాక్‌: భజ్జీ

27 Oct, 2021 11:51 IST|Sakshi

Harbhajan Singh- Mohammad Amir Twitter War: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ మధ్య ట్విటర్‌ యుద్ధం తారస్థాయికి చేరింది. సరదాగా మొదలైన మాటల యుద్ధం కాస్తా.. సీరియస్‌గా మారింది. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఆమిర్‌.. ఒకానొక టెస్టు మ్యాచ్‌లో షాహిద్‌ ఆఫ్రిది.. హర్భజన్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన వీడియో క్లిప్‌ను షేర్‌ చేశాడు. భజ్జీ బౌలింగ్‌లో ఆఫ్రిది సిక్సర్లు బాదిన దృశ్యాలు అవి. అయితే, ఈ వీడియో హర్భజన్‌కు ఆగ్రహం తెప్పించింది. 

ఆమిర్‌కు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో... 2010 నాటి లార్డ్స్‌ టెస్టుకు సంబంధించిన నో- బాల్‌ స్కాండల్‌ను భజ్జీ ప్రస్తావించాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన సదరు టెస్టు మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు సల్మాన్‌ భట్‌, మహ్మద్‌ ఆసిఫ్‌, ఆమిర్‌లు తప్పు చేశారని నిరూపితం కావడంతో కొంతకాలం నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదాన్ని గుర్తుచేస్తూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు

చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్‌ ఖాన్‌

‘‘లార్డ్స్‌లో నో బాల్‌ ఎలా అయ్యిందో?? ఎంత ఇచ్చారు.. ఎవరు ఇచ్చారు? టెస్టు క్రికెట్‌... అది నో బాల్‌ ఎలా అవుతుంది? సిగ్గుపడు.. ఆటను అగౌరపరిచినందుకు నువ్వు, నీ మద్దతు దారులు సిగ్గుపడాలి’’ అని ట్విటర్‌ వేదికగా ఆమిర్‌కు కౌంటర్‌ ఇచ్చాడు.

అదే విధంగా వరుస ట్వీట్లలో... ‘‘ఆమిర్‌ లాంటి వాళ్లకు పైసా.. పైసా.. పైసా.. పైసా... ఇజ్జత్‌ లేదు.. ఏం లేదు.. కేవలం డబ్బే కావాలి.. నీకు, నీ మద్దతుదారులకు ఎంత డబ్బు దొరికిందో చెప్పగలవా.. ఛీ యాక్‌.. నీలా ఆటకు కళంకం తెచ్చి.. ప్రేక్షకులను పిచ్చివాళ్లుగా భావించే వాళ్లతో నేను మాట్లాడను. గెట్‌ లాస్ట్‌’’ అంటూ భజ్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఫిక్సర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ అంటూ సిక్సర్‌ బాదిన ఓ వీడియో క్లిప్‌ షేర్‌ చేసి ఆమిర్‌ను తూర్పారబట్టాడు. హర్భజన్‌ ట్వీట్లు నెట్టింట చర్చకు దారితీశాయి.

Pakistan Vs England 2010 Match Fixing: 2010లో ఏం జరిగింది?
ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌.. 2010లో లార్డ్స్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌ ఆడాయి. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా..  మూడు నోబాల్స్‌ పడ్డాయి. అయితే ఇందుకు సంబంధించిన అసలు నిజాలు రెండు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. అప్పటి పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌, బౌలర్లు మహ్మద్‌ ఆమిర్‌, మహ్మద్‌ ఆసిఫ్‌ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయి. 

తనను తాను బుకీగా సల్మాన్‌ భట్‌తో పరిచయం చేసుకున్న జర్నలిస్టు మజర్‌ మజీద్‌.. అతడికి డబ్బు ఆశ చూపించాడు. ఇంగ్లండ్‌కు మేలు చేకూరేలా వ్యవహరించాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన సల్మాన్‌... మొదటి రోజు ఆటలో ఆమిర్‌తో రెండు, ఆసిఫ్‌తో ఒక నో బాల్‌ వేయించాడు. బ్రిటన్‌కు చెందిన వార్తా సంస్థ... న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌(ఇప్పుడు ఉనికిలో లేదు)చేపట్టిన ఈ స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను తమ టాబ్లాయిడ్‌లో బహిర్గతం చేసింది. క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఈ ఉదంతం పాకిస్తాన్‌ ప్రతిష్టను దిగజార్చింది.

పాక్‌ ముగ్గురు క్రికెటర్లు దోషులుగా తేలారు. నిషేధం ఎదుర్కొన్నారు. జైలు పాలయ్యారు. అంతేకాదు.. ఈ వివాదం కారణంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ సమాజం నుంచి నిషేధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. క్రికెట్‌ పుట్టిన గడ్డ మీదే ఇంతటి నీచమైన పనిచేస్తారా అంటూ ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి.

ఈ ఘటన నేపథ్యంలో కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న ఆమిర్‌ 2016లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడేందుకు అనుమతి పొందాడు. ఇక ఆసిఫ్‌ ఏడేళ్ల పాటు నిషేధం, ఏడాది జైలు శిక్ష అనుభవించాడు. సల్మాన్‌ భట్‌ ఇంతవరకు ఈ వివాదం తాలుకు మచ్చ చెరిపేసుకోలేకపోయాడు.

చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌.. అతడు టోర్నీ నుంచి అవుట్‌!

మరిన్ని వార్తలు