Hockey World Cup 2023: భారత్‌ 9వ స్థానంతో ముగింపు

29 Jan, 2023 05:30 IST|Sakshi

5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపు

ప్రపంచకప్‌ హాకీ

భువనేశ్వర్‌: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌ హాకీలో క్వార్టర్‌ ఫైనల్‌ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున అభిషేక్‌ (4వ ని.), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (11వ ని.), షంషేర్‌ సింగ్‌ (44వ ని.), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (48వ ని.), సుఖ్‌జీత్‌ సింగ్‌ (58వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్‌ (59వ ని.) చెరో గోల్‌ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్‌ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్‌లోనే హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్‌ ఆఖరి క్వార్టర్‌లో మరో రెండు ఫీల్డ్‌ గోల్స్‌ను ఆకాశ్‌దీప్, సుఖ్‌జీత్‌ సాధించడంతో విజయం సులువైంది.

► నేడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల ఫైనల్‌
జొకోవిచ్‌ ( సెర్బియా) X సిట్సిపాస్‌ ( గ్రీస్‌)
మ.గం. 2 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు