కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు

10 Jun, 2021 19:20 IST|Sakshi

న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్‌ సమయంలో టీమిండియా పగ్గాలు తనకే ఇస్తారని భావించానని సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. అయితే, సెలెక్టర్లు ధోనీ పేరు తెరపైకి తేవడంతో తాను కూడా అదే సరైన నిర్ణయంగా భావించానని ఆయన తెలిపాడు. ధోనీ కెప్టెన్‌ అయ్యాక అతనికి పూర్తిగా మద్దతిచ్చానని చెప్పుకొచ్చాడు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ.. 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని, దీంతో టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు సీనియర్లందరూ అయిష్టత చూపారని, ఆ సమయంలో నేను కెప్టెన్సీ రేసులో ముందున్నాని గుర్తు చేసుకున్నాడు. 

సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ లాంటి సీనియర్ల గైర్హాజరీలో తనకే కెప్టెన్సీ వస్తుందని అందరూ భావించారని, అయితే సెలక్టర్లు సడెన్‌గా ధోనీ పేరును తెరపైకి తేవడం, అతను టీమిండియా పగ్గాలు చేపట్టడం చకాచకా జరిగిపోయాయని తెలిపాడు. అయితే, ఆ విషయాన్ని తాను అప్పుడే వదిలేశానని, కెప్టెన్‌ ఎవరైనా సరే ఆటగాడిగా తాను రాణించడమే ముఖ్యమని భావించానని పేర్కొన్నాడు. కాగా, ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన యువీ 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆ క్రమంలో అతను 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. 

అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ యువీ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉంటే, 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత, పెద్దగా అంచనాలు లేని యువ భారత జట్టు ధోనీ నేతృత్వంలో తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌ను ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌ అంచనాలకు మించి రాణించి, రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ విజయం తర్వాత భారత క్రికెట్‌లో ధోనీకి తిరుగు లేకుండా పోయింది. నాటి నుంచి ధోనీ, యువీ ఇద్దరూ టీమిండియాలో కీలక సభ్యులుగా ఎదుగుతూ భారత క్రికెట్‌ రూపురేఖలనే మార్చేశారు. ఈ క్రమంలో వారు భారత్‌ను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు.
చదవండి: 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు..

>
మరిన్ని వార్తలు