ILT20: ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్‌.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్‌

4 Feb, 2023 08:45 IST|Sakshi

అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్‌ ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20లో ఎంఐ ఎమిరేట్స్‌ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న పొలార్డ్‌ తాజాగా మరో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన పొలార్డ్‌ 337 పరుగులు చేశాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన పొలార్డ్‌ ప్రస్తుతం లీగ్‌లో రెండో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 

శుక్రవారం లీగ్‌లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్‌రైడర్స్‌ మధ్య 26వ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మహ్మద్‌ వసీమ్‌ 60 పరుగులతో రాణించగా.. ఆఖర్లో పొలార్డ్‌ 17 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టక్కర్‌ 33 పరుగులు చేశాడు.

అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నైట్‌రైడర్స్‌ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రసెల్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఐ ఎమిరేట్స్‌ బౌలర్లలో డ్వేన్‌ బ్రేవో మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్‌ తాహిర్‌, జహూర్‌ ఖాన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

కాగా ఈ విజయంతో ఎంఐ ఎమిరేట్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. సీజన్‌లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఎనిమిదో పరాజయం. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ రద్దు కాగా.. ఎనిమిదింటిలో ఓడిన ఆ జట్టు ఎప్పుడో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ఇప్పటికే డెసర్ట్‌ వైపర్స్‌, గల్ఫ్‌ జెయింట్స్‌ కూడా ప్లే ఆఫ్స్‌కు వెళ్లగా.. తాజాగా ఎంఐ ఎమిరేట్స్‌ ప్లేఆఫ్‌కు చేరకుంది. ఇక షార్జా వారియర్స్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌లో ఏ జట్టు నాలుగో స్థానంలో ప్లేఆఫ్‌కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్‌

మరిన్ని వార్తలు