IPL 2023: 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' నిబంధన.. బీసీసీఐ షాకింగ్‌ ట్విస్ట్‌!

9 Dec, 2022 12:20 IST|Sakshi

బీసీసీఐ ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సబ్‌స్టిట్యూట్‌ అంటే ఫీల్డర్‌ గాయపడితే అతని స్థానంలో మైదానంలోకి వస్తాడు. కానీ అతనికి ఫీల్డింగ్‌ మినహా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశం ఉండదు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేలా బీసీసీఐ ''ఇంపాక్ట్‌ ప్లేయర్‌'' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. దేశవాలీ టోర్నీలో హృతిక్‌ షోకీన్‌ తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఇక వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను తీసుకురానున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ రూల్ ప్రకారం.. ప్రతీ జట్టు మ్యాచ్ కు ముందు నలుగురు ప్లేయర్లను సబ్ స్టిట్యూట్స్ గా ప్రకటించాలి.   14 ఓవర్ల ఆట తర్వాత ఈ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా  తుది జట్టులోకి తీసుకోవచ్చు. 

ఇంపాక్ట్‌ ప్లేయర్‌పై చర్చ జరుగుతుండగానే బోర్డు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు షాకిచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్  నిబంధన కేవలం ఇండియన్ ప్లేయర్స్ కే వర్తింపజేయనున్నదట. లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు  ఈ రూల్ వర్తించదని సమాచారం.

ఈ రూల్ విదేశీ ప్లేయర్లకు వర్తించకపోవడానికి గల కారణాలను జట్లకు క్షుణ్ణంగా తెలిపినట్టు సమచారం.  నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ మ్యాచ్ లో నలుగురు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే ఆడించేందుకు అనుమతి ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ ను అమలుచేస్తే అప్పుడు ఐదుగురు ఫారెన్ ప్లేయర్లను ఆడించినట్టు అవుతుంది. అది నిబంధనలకు విరుద్ధం. అందుకే ఈ రూల్‌ను కేవలం భారత క్రికెటర్లకే వర్తిస్తుందని  బీసీసీఐ ఫ్రాంచైజీలకు వివరించే ప్రయత్నం చేసింది.

ఒకవేళ ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వాడుకోవచ్చా..? అని ఫ్రాంచైజీలు ప్రశ్నించాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుతం సమాలోచనలు  చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలం అనంతరం ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై  పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. 

చదవండి: Impact Player: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి

మరిన్ని వార్తలు