దిగ్గజ క్రికెటర్ల సమరం

2 Dec, 2023 09:41 IST|Sakshi
శ్రీశాంత్‌తో అభిమానుల సెల్ఫీ

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖలో మళ్లీ క్రికెట్‌ సందడి మొదలైంది. ఈ సారి దిగ్గజ క్రికెటర్లు క్రీడాభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్త మేటి మాస్టర్‌ క్రికెటర్లతో కూడిన లెజెండ్స్‌ క్రికెట్‌ టోర్నీ(ఎల్‌ఎల్‌సీ)కి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. శనివారం నుంచి లీగ్‌ చివరి దశ మూడు టీ–20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దేశంలోని ఐదు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనుండగా.. నాలుగో వేదికగా వైఎస్సార్‌ స్టేడియం నిలిచింది. ఇక్కడ జరిగే మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సూరత్‌ వేదికగా టైటిల్‌ కోసం నాకవుట్‌లో తలపడనున్నాయి. మాజీ క్రికెటర్లతో కూడిన ఆరు జట్లు తలపడుతుండగా.. విశాఖలో ఐదు జట్లు ఆడనున్నాయి. శుక్రవారం నాలుగు జట్లు విశాఖకు చేరుకున్నాయి.

ఆధిక్యంలో అర్బన్‌ రైజర్స్‌
టోర్నీలో భాగంగా లీగ్‌ దశలో ఆరు జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. అర్బన్‌ రైజర్స్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆధిక్యంలో కొనసాగుతోంది. గుజరాత్‌ జెయింట్స్‌ రెండు మ్యాచ్‌ల్లో విజయంతో ఐదు పాయింట్లు, మణిపాల్‌ టైగర్స్‌ మూడు మ్యాచ్‌లే ఆడి నాలుగు పాయింట్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. విశాఖ వేదికగా టైగర్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనుండగా గుజరాత్‌ జెయింట్స్‌, అర్బన్‌ రైజర్స్‌ లీగ్‌ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇండియన్‌ క్యాపిటల్స్‌, సదరన్‌ సూపర్‌ స్టార్స్‌ జట్లు నాలుగేసి మ్యాచ్‌లాడి ఒకే విజయం సాధించాయి. ఇక బికనీర్‌ కింగ్స్‌ ఐదూ మ్యాచ్‌లను పూర్తి చేసి కేవలం ఒకే విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. జెయింట్స్‌, టైగర్స్‌, అర్బన్‌ రైజర్స్‌ జట్లు దాదాపుగా నాకవుట్‌కు చేరుకోగా విశాఖలో మ్యాచ్‌లు అనంతరం క్యాపిటల్స్‌, సదరన్‌ స్టార్స్‌ జట్లలో ఓ జట్టు నాలుగో స్థానం సాధించి నాకవుట్‌కు చేరనుంది. వెనుకబ డిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.

సత్తా చాటుతున్న లెజెండ్స్‌
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు ఆయా జట్ల తరఫున సత్తాచాటుతున్నారు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన రైట్‌ ఆర్మ్‌ హాఫ్‌ బ్రేకర్‌ హర్బజన్‌ మూడు ఇన్నింగ్స్‌ ఆడి 11 ఓవర్లు వేశాడు. సూపర్‌ స్టార్స్‌పై 10 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీయగా కింగ్స్‌పై ఎనిమిది పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. జెయింట్స్‌పై ఓ మేడిన్‌తో 10 పరుగులిచ్చి ఇద్దరిని పెవిలియన్‌ దారి పట్టించాడు. టాప్‌ రన్‌ స్కోరర్లుగా మూడు మ్యాచ్‌ల్లో రిచర్డ్‌ పావెల్‌ 126 పరుగులతో, నాలుగు మ్యాచ్‌ల్లో 121 పరుగులతో లెండీ సిమ్మన్స్‌ కొనసాగుతున్నారు. టాప్‌ వికెట్‌ టేకర్లుగా మూడు మ్యాచ్‌ల్లోనే పర్వీందర్‌, ఇమ్రాన్‌ ఆరేసి వికెట్లు తీయగా నాలుగు మ్యాచ్‌ల్లో అబ్దుల్‌ రజాక్‌ ఆరు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌ స్ట్రయిక్‌ రేట్‌ 250గా రస్టీ రెండు మ్యాచ్‌లో సాధించగా.. అప్పన్న ఒక మ్యాచ్‌లోనే సాధించాడు.

ఇవీ జట్లు
అర్బన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సురేష్‌ రైనా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్మిత్‌, గుప్తిల్‌ ఓపెనర్లుగా రానున్నారు. టాపార్డర్‌లో గురుకీరత్‌తో పాటు కెప్టెన్‌ రైనా ఉంటాడు. క్రిస్‌, పీటర్‌, జెరోమ్‌ బంతులతో చెలరేగనున్నారు. పవన్‌, స్టువర్ట్‌, దేవేంద్ర సహకరించనున్నారు. అమిత్‌ వికెట్ల వెనుక నిలవనున్నాడు.

► గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు పార్థివ్‌ పటేల్‌ నాయకత్వం వహిస్తుండగా.. ఓపెనర్లుగా కల్లీస్‌, క్రిస్‌ గేల్‌ వ్యవహరించనున్నారు. రిచర్డ్‌, కెవిన్‌ టాపార్డర్‌లో నిలకడగా రాణిస్తుండగా పార్థివ్‌ ఈ మ్యాచ్‌లో ఆడకుంటే ధ్రువ్‌ వికెట్ల వెనుక నిలవనున్నాడు. ఎమ్రిత్‌, శ్రీశాంత్‌ బౌలింగ్‌ను ఓపెన్‌ చేయనుండగా సర్బజీత్‌, ప్రసన్న, ఈశ్వర్‌, సులేమాన్‌లు బౌలింగ్‌లో సత్తాచాటనున్నారు.

► మణిపాల్‌ టైగర్స్‌ జట్టుకు హర్బజన్‌ సింగ్‌ నాయకత్వం వహిస్తుండగా రాబిన్‌ ఉతప్ప, బద్రీనాథ్‌ ఓపెనర్లుగా దిగుతారు. హామిల్టన్‌, మహ్మద్‌ కై ఫ్‌, పెరీరా టాపార్డర్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బౌలర్లు మిచెల్‌, పర్వీందర్‌, పెరీరా, ఇమ్రాన్‌, ప్రవీణ్‌,కొలిన్‌ ఉన్నారు.

► గౌతమ్‌ గంభీర్‌ సారథిగా వ్యవహరించే ఇండియా క్యాపిటల్స్‌లో రిచర్డ్‌ పావెల్‌, జ్ఞానేశ్వర్‌, ఎడ్వర్డ్స్‌, కెవిన్‌ పీటర్సన్‌, రస్టీ, ఉదానా, బెన్నట్‌, అప్పన్న, ఆస్లే బౌలింగ్‌ తదితరులు ఉన్నారు.

► రాస్‌ టేలర్స్‌ సారథిగా ఉన్న సదరన్‌ సూపర్‌స్టార్స్‌ జట్టులో దిల్షాన్‌, తరంగా ఓపెనర్లుగా దిగనున్నారు. వికెట్ల వెనుక శ్రీవత్స్‌ నిలవనున్నాడు. టాపార్డర్‌లో చతురంగతో కలిసి టేలర్స్‌ కొనసాగనున్నాడు. లక్మాల్‌, దిండా, రజాక్‌తో పాటు హామిద్‌, బిపుల్‌, దిల్షాన్‌, పవన్‌ నేగీ బౌలింగ్‌ వేయనున్నారు.

ఇదీ షెడ్యూల్‌
తలపడనున్న జట్లు మ్యాచ్‌ ప్రారంభం

2వ తేదీ ఇండియా క్యాపిటల్స్‌ x మణిపాల్‌ టైగర్స్‌ సాశ్రీశ్రీ 6.30 గంటలు

3వ తేదీ గుజరాత్‌ జెయింట్స్‌ x సదరన్‌ సూపర్‌స్టార్స్‌ సాశ్రీశ్రీ 3 గంటలు

4వ తేదీ మణిపాల్‌ టైగర్స్‌ x అర్బన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ సాశ్రీశ్రీ 6.30 గంటలు

(Paytm Insider (https://insider.in/visakhapatnam)లో

టికెట్లు కొనుగోలు చేసి.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించవచ్చు)

మరిన్ని వార్తలు