IND vs AUS: 'ఆస్ట్రేలియాకు కోహ్లి చుక్కలు చూపిస్తాడు.. కనీసం రెండు సెంచరీలైనా'

5 Feb, 2023 13:15 IST|Sakshi

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఇప్పుడు టెస్టుల్లో కూడా తన పూర్వ వైభవాన్ని పొందాలని భావిస్తున్నాడు. టెస్టుల్లో విరాట్‌ సెంచరీ సాధించి దాదాపు 1000 రోజులు పైనే అవుతుంది.

దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో సెంచరీ సాధించి.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాలని కింగ్‌ కోహ్లి యోచిస్తున్నాడు. నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రంమంలో నాగ్‌పూర్‌లోని ఓల్డ్‌ విదర్భ క్రికెట్‌ ఆసోషియషన్‌ గ్రౌండ్‌లో కోహ్లి కఠోర సాధన చేస్తున్నాడు.

ఇక ఈ సిరీస్‌ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటేనే చాలు కోహ్లి చెలరేగిపోతాడని చోప్రా అన్నాడు. అదే విధంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్‌ కనీసం రెండు సెంచరీలైనా సాధిస్తాడని అతడు జోస్యం చెప్పాడు.

కనీసం రెండు సెంచరీలైనా..
"బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇదొక చారిత్రత్మక సిరీస్‌. కాబట్టి ఈ సిరీస్‌లో విరాట్‌ కోహ్లి పరుగులు చేయడం తప్పనిసరి. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటే చాలు కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. గతంలో కూడా ఆస్ట్రేలియాపై విరాట్‌ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. కాబట్టి మరోసారి ఆసీస్‌పై కోహ్లి విరుచుకుపడతాడు.  ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి కనీసం రెండు సెంచరీలు సాధిస్తాడు" అని చోప్రా జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే..
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నేను ఒక్క విషయం గమనించాను. విరాట్‌ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. బంగ్లా సిరీస్‌లో స్పిన్నర్‌  తైజుల్ ఇస్లాంకు రెండు సార్లు వికెట్‌ సమర్పించుకున్నాడు. అతడు వేసిన ఫుల్‌ డెలివరీని కోహ్లి బ్యాక్‌ఫూట్‌లో ఆడి క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఇదేవిధంగా విరాట్‌ తన వికెట్‌ను కోల్పోయాడు.  మిచెల్ సాంట్నర్ వేసిన ఫుల్‌ డెలివరీకి కోహ్లి అడడంలో విఫలమయ్యాడు. కాబట్టి కాస్త స్పిన్నర్లపై దృష్టిపెడితే చాలు అని చోప్రా అన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారత జట్టులోకి జయంత్‌ యాదవ్‌, పుల్కిత్

మరిన్ని వార్తలు