Pat Cummins: గతం అనవసరం... మా జట్టు బలంగా ఉంది! నాగ్‌పూర్‌ పిచ్‌ ఎలా ఉందంటే..

9 Feb, 2023 07:24 IST|Sakshi
రోహిత్‌ శర్మ- ప్యాట్‌ కమిన్స్‌(Pc: Twitter)

India Vs Australia 2023 - 1st Test: ‘‘భారత గడ్డపై ఆసీస్‌ పాత రికార్డు గురించి మాట్లాడటం అనవసరం. అప్పుడు వారు ఎలా ఆడినా, ఇప్పటి మా టీమ్‌ చాలా బాగుంది. కఠిన పరిస్థితులకు, ఎలాంటి సవాళ్లకైనా మేం సిద్ధం’’ అని ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ అన్నాడు.  ఏ తరహా పిచ్‌ ఉన్నా దానికి తగ్గట్టు తమ ఆటను మార్చుకుంటామని పేర్కొన్నాడు. కాగా నాగ్‌పూర్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం (ఫిబ్రవరి 9) టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కమిన్స్‌.. తమ జట్టు ప్రస్తుతం పటిష్టంగా ఉందని, ఎలాంటి పిచ్‌పై అయినా సమర్థవంతంగా ఆడగలమని చెప్పుకొచ్చాడు. కాగా తమకు అనుకూలించేలా భారత జట్టు పిచ్‌ తయారు చేయించుకుందంటూ('డాక్టర్డ్‌ పిచ్‌(Doctored Pitch) క్రికెట్‌ ఆస్ట్రేలియా అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిన్స్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అలాంటి వాళ్లు ఇలా ఆలోచించరు
ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘టాస్‌ సమయంలోనే అన్ని పరిస్థితులను అంచనా వేసి దానికి తగినట్లుగానే తుది జట్టును ఎంపిక చేస్తాం. మేం పిచ్‌ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బాగా ఆడటంపైనే మా దృష్టి.

గతంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. 22 మంది కూడా నాణ్యమైన ఆటగాళ్లే బరిలోకి దిగుతారు. వారు బంతి ఎంత టర్న్‌ అవుతుంది, స్వింగ్‌ అవుతుంది ఇలాంటివి ఆలోచించరు’’ అని కంగారూ ఆటగాళ్లకు చురకలు అంటించాడు.

భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా తొలి టెస్టు
ఫిబ్రవరి 09, గురువారం- ఫిబ్రవరి 13, సోమవారం- విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, నాగ్‌పూర్‌, మహారాష్ట్ర

పిచ్, వాతావరణం
సందేహం లేకుండా స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌. మ్యాచ్‌ ఆరంభమయ్యాక ఎంత తొందరగా టర్న్‌ కావడం మొదలవుతుందనేది ఆసక్తికరం. అనుకూల వాతావరణం. వర్షం సమస్య లేదు.  

తుది జట్లు (అంచనా):  
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, ఛతేశ్వర్‌ పుజారా, కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, కేఎస్‌ భరత్, అక్షర్‌పటేల్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌.  

ఆస్ట్రేలియా: ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, స్టీవ్‌ స్మిత్, ట్రావిస్‌ హెడ్, హ్యాండ్స్‌కోంబ్‌/రెన్‌షా, అలెక్స్‌ క్యారీ, అష్టన్‌ అగర్‌/మర్ఫీ, నాథన్‌ లియోన్‌, స్కాట్‌ బోలండ్‌.

చదవండి: Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు
ICC T20I Rankings: దుమ్మురేపిన శుభ్‌మన్‌ గిల్‌.. సత్తా చాటిన హార్ధిక్‌ పాండ్యా

మరిన్ని వార్తలు