Ind Vs Eng: టీమిండియాదే ఈ సిరీస్‌: మైకేల్‌ వాన్‌

3 Aug, 2021 14:26 IST|Sakshi

లండన్‌: ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినపుడు పిచ్‌లపై తన వైఖరి వెల్లడిస్తూ ట్రోలింగ్‌ బారిన పడ్డాడు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌. ముఖ్యంగా చెన్నై, అహ్మదాబాద్‌ పిచ్‌ల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ టీమిండియా సామర్థ్యంపై సెటైర్లు వేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ప్రస్తుతం భారత్‌ టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ టూర్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. 

ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మైకేల్‌ వాన్‌.. ఈసారి మాత్రం సిరీస్‌ టీమిండియాదే అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయం చెప్పడానికి తానుఇష్టపడనప్పటికీ... ప్రస్తుత బలబలాల ఆధారంగా భారత జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిప్రాయాలు, అంచనాలు కొన్నిసార్లు నిజం కావచ్చు. మరికొన్ని సార్లు తప్పు కావచ్చు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బెన్‌ స్టోక్స్‌ గైర్హాజరీలో ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ప్రస్తుత సిరీస్‌లో ఈసారి టీమిండియాదే విజయం‌. వాళ్లకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రెండుసార్లు చేరువగా వచ్చినా ఓడిపోయారు. 

ఇప్పుడు స్టోక్స్‌ లాంటి కీలక ఆటగాడు లేకుండానే ఇంగ్లండ్‌ పోటీలోకి దిగనుంది. తను లేకుండా బాలెన్స్‌ చేయడం కష్టం. ఆల్‌రౌండర్‌లేని కారణంగా ఓ బ్యాటర్‌, బౌలర్‌ని మిస్‌ అవుతారు. కాబట్టి జో రూట్‌ సేనకు కష్టమే. ఆగష్టు, సెప్టెంబరులో స్పిన్‌ మాయాజాలమే పనిచేస్తుంది. కాబట్టి ఈ విషయం చెప్పడానికి నేను ద్వేషిస్తున్నా.. అయినా 3-1తేడాతో టీమిండియా తప్పక ఈ సిరీస్‌ గెలుస్తుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా తాను మానసిక ఆందోళనకు గురవుతున్న సాంత్వన పొందేందుకు క్రికెట్‌కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు