Suryakumar Yadav: సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్‌ కాదా!? కివీస్‌ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

21 Nov, 2022 13:30 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌

New Zealand vs India, 2nd T20I- Suryakumar Yadav: అద్భుత అజేయ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా బ్యాటర్‌  సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఎంతో మంది అత్యుత్తమ టీ20 ప్లేయర్లు ఉన్నారని.. సూర్యను ఇప్పుడే బెస్ట్‌ బ్యాటర్‌ అనలేమంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యా సేన.. న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఇక టార్గెట్‌ ఛేదనలో టాపార్డర్‌ విఫలం కావడంతో కివీస్‌ 18.5 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. 

దీంతో 65 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్‌.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సూర్య విధ్వంసకర ఆట తీరు కివీస్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన తీరును టీమిండియా ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేశారు.

సౌతీ హ్యాట్రిక్‌
ఇదిలా ఉంటే.. రెండో టీ20లో కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌతీ.. 4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 34 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌ వికెట్లు వరుసగా పడగొట్టి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన సౌతీకి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సూర్య ఇన్నింగ్స్‌ గురించి ప్రశ్న ఎదురైంది. మీరు బౌలింగ్‌ చేసిన టీమిండియా ఆటగాళ్లలో అత్యుత్తమ టీ20 ప్లేయర్‌గా సూర్యను భావిస్తారా అని మీడియా అడుగగా.. సౌథీ ఆసక్తికర సమాధానమిచ్చాడు. 

ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు.. ఇక సూర్య
‘‘ఇండియాలో ఎంతో మంది గొప్ప టీ20 ప్లేయర్లు ఉన్నారు. కేవలం పొట్టి ఫార్మాట్‌లో మాత్రమే కాదు ఇతర ఫార్మాట్లలోనూ ఇండియా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వాళ్లంతా సుదీర్ఘ కాలంగా వివిధ ఫార్మాట్లలో తమ సేవలు అందిస్తూ మేటి ఆటగాళ్లుగా ఎదిగారు.

ఇక సూర్య విషయానికొస్తే.. గత 12 నెలలుగా అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో, అంతర్జాతీయ స్థాయిలో అతడు రాణిస్తున్నాడు. ఈ రోజు కూడా చాలా బాగా ఆడాడు. అయితే, ఇదే తరహాలో అతడు ఆట తీరు కొనసాగించాల్సి ఉంది’’ అని టిమ్‌ సౌతీ అభిప్రాయపడ్డాడు. కాగా సూర్యకు ఇది అంతర్జాతీయ టీ20లలో రెండో శతకం కావడం విశేషం.

చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్‌!
IND vs NZ: సలాం సూర్య భాయ్‌.. కోహ్లి రికార్డు బద్దలు! ఏకైక భారత ఆటగాడిగా

మరిన్ని వార్తలు