INDA VS NZA 3rd Test: పాటిదార్‌ అజేయ శతకం.. కివీస్‌కు భారీ టార్గెట్‌ నిర్ధేశించిన భారత్‌

17 Sep, 2022 19:19 IST|Sakshi

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న మూడో అనధికర టెస్ట్‌లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. రజత్‌ పాటిదార్‌ (135 బంతుల్లో 109 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో, రుతురాజ్‌ (164 బంతుల్లో 94; 11 ఫోర్లు), కెప్టెన్‌ ప్రియాంక్‌ పంచల్‌ (114 బంతుల్లో 62; 6 ఫోర్లు) అర్ధశతకాలతో  రాణించడంతో టీమిండియా కివీస్‌కు 406 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. భారీ లక్ష్య  ఛేదనలో ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయిన కివీస్‌ (రచిన్‌ రవీంద్ర (12)).. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 20 పరుగులు చేసింది. కివీస్‌ గెలవాలంటే మ్యాచ్‌ ఆఖరి రోజు (నాలుగో రోజు) మరో 396 పరుగులు చేయాల్సి ఉంది.  

మూడో రోజు ఆటలో పాటిదార్‌, రుతురాజ్‌, పంచల్‌ చెలరేగడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 357 పరుగుల (7 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్‌ చేసింది. కివీస్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర 3 వికెట్లు, జో వాకర్‌ 2, సోలియా, కెప్టెన్‌ టామ్‌ బ్రూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌ ఆటగాళ్లు చాప్‌మన్‌ (92), సోలియా (54) అర్ధ సెంచరీలతో రాణించడంతో కివీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

భారత బౌలర్లలో సౌరభ్‌ కుమార్‌ 4, రాహుల్‌ చాహర్‌ 3, ముకేశ్‌ కుమార్‌ 2, శార్ధూల్‌ ఠాకూర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌటైంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా, వికెట్‌ కీపర్‌ ఉపేంద్ర యాదవ్‌ (76) అర్ధసెంచరీతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫిషర్‌ 4, జో వాకర్‌, జాకబ్‌ డఫీ తలో రెండు వికెట్లు, సోలియా, రచిన్‌ రవీంద్ర చెరో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం కివీస్‌-ఏ భారత్‌-ఏ జట్ల మధ్య మూడు అనధికార వన్డే మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి.   

మరిన్ని వార్తలు