Moto GP Race: భారత్‌లో అడుగుపెట్టనున్న మోటో జీపీ.. మెగా ఈవెంట్‌ ఎప్పుడంటే?

22 Sep, 2022 12:45 IST|Sakshi

ఫార్ములా రేసింగ్‌ను ఇష్టపడే భారత అభిమానులకు శుభవార్త. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే మోటో జీపీ బైక్‌ రేసింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తొలిసారి ఇండియాకు రాబోతుంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను ''గ్రాండ్‌ పిక్స్‌ ఆఫ్‌ భారత్‌'' పేరుతో మన దేశంలో నిర్వహించనున్నారు. అందుకోసం గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఫెయిర్‌స్ట్రీట్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, డోర్నా స్పోర్ట్స్‌ మధ్య ఎంఓయూ కుదిరింది. 

మోటార్‌సైకిల్‌ రేసును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత ప్రేక్షకులకు అందించేందుకు డోర్నా స్పోర్ట్స్‌ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనికోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. అంతేకాదు ఇంటర్నేషనల్‌ లెవల్‌ మోటో జీపీ రైడర్లను ఇండియాలో తయారు చేసే దిశగా కృషి చేస్తోంది.

మోటో జీపీనే కాదు.. మోటో ఈని కూడా ఇండియాకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకముందు భారత్‌లో తొలిసారి జరిగిన ఫార్ములా వన్‌ ఇండియన్ గ్రాండ్ ప్రికి కూడా నోయిడాలో ఉన్న ఈ బుద్ధ్‌ ఇంటర్నేషనల్ సర్క్యూటే ఆతిథ్యమిచ్చింది. అయితే ఒక సీజన్‌తోనే ఎఫ్‌1 ఇండియన్ గ్రాండ్‌ ప్రిని ముగించింది. ఇప్పుడు మోటో జీపీ రాక రేసింగ్ ప్రియులకు ఆనందాన్నిస్తోంది.

చదవండి: తీవ్రంగా గాయపడిన ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌

మరిన్ని వార్తలు