వివాదాస్పద రీతిలో...

29 Aug, 2020 01:28 IST|Sakshi

సెమీ ఫైనల్‌ చేరిన భారత్‌ 

ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు  సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ ఆర్మేనియాను ఓడించింది. తొలి రౌండ్‌ పోరులో భారత్‌ 3.5–2.5 పాయింట్ల తేడాతో ఆర్మేనియాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున విదిత్‌ గుజరాతీ, ద్రోణవల్లి హారిక, నిహాల్‌ సరీన్‌ విజయాలు సాధించగా...కోనేరు హంపి, వంతిక అగర్వాల్‌ తమ ఆటలో పరాజయం పాలయ్యారు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు విశ్వనాథన్‌ ఆనంద్, ఆరోనియన్‌ లెవాన్‌ మధ్య పోరు ‘డ్రా’గా ముగిసింది. అనంతరం రెండో రౌండ్‌ పోరుకు భారత్‌ సన్నద్ధమైంది.  

అప్పీల్‌ తిరస్కరణ... 
అయితే భారత ఆటగాడు నిహాల్‌ సరీన్‌ చేతిలో ఆర్మేనియన్‌ మార్టిరోస్యాన్‌ హెయిక్‌ ఓడిన పోరు వివాదంగా మారింది. ఆట సాగుతున్న సమయంలో ఆన్‌లైన్‌ కనెక్షన్‌ పోయిందని ఆర్మేనియా జట్టు ‘ఫిడే’కు ఫిర్యాదు చేసింది. ఈ అప్పీల్‌పై సుదీర్ఘ సమయం పాటు విచారణ జరగగా... తమ వైపునుంచి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ బాగుందని, నిర్వాహకుల ద్వారా సాంకేతిక లోపమే పరాజయానికి కారణమని ఆర్మేనియా వాదించింది. అయితే ఆ జట్టు అప్పీల్‌ను తిరస్కరించిన అప్పీల్స్‌ కమిటీ ఫలితంలో మార్పు లేదని ప్రకటించింది.

ఆ తర్వాత కూడా ఆర్మేనియా తమ నిరసనను కొనసాగించింది. చివరకు తాము రెండో రౌండ్‌ ఆడమని, విత్‌డ్రా చేసుకుంటున్నట్లు చెబుతూ ‘డిఫాల్ట్‌’గా ప్రకటించింది. దాంతో భారత్‌ సెమీస్‌ చేరడం ఖాయమైంది. ఇదే టోర్నీలో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా కోనేరు హంపి, విదిత్‌ గుజరాతి మధ్యలో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోవడంతో ఓటమిపాలయ్యారు. అయితే భారత జట్టు మాత్రం అప్పీల్‌కు వెళ్లకుండా ఫలితాన్ని స్వీకరించింది. శనివారం అజర్‌బైజాన్, పోలండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌ విజేతతో సెమీ ఫైనల్లో భారత్‌ తలపడుతుంది.    

మరిన్ని వార్తలు