వన్డేలతో మొదలు...

23 Oct, 2020 05:54 IST|Sakshi

భారత పర్యటనకు ఆసీస్‌ ప్రభుత్వ ఆమోదముద్ర

తుది షెడ్యూలు ఖరారు చేసిన సీఏ

మెల్‌బోర్న్‌: కంగారూ గడ్డపై భారత జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సిరీస్‌కు గురువారం పచ్చజెండా ఊపడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తేదీలతో సహా తుది షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనిని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదించడం లాంఛనమే. అయితే ఈ పూర్తి స్థాయి పర్యటనలో చిన్న మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ ద్వైపాక్షిక సమరంలో ఇన్నాళ్లు ముందుగా పొట్టి ఫార్మాట్‌ మ్యాచ్‌లు జరుగుతాయన్న సీఏ ఇప్పుడు మార్చింది. తొలుత వన్డేలు... ఆ తర్వాతే టి20 జరుగుతాయని ప్రకటించింది. కంగారూ గడ్డపై అడుగుపెట్టగానే సిడ్నీలో భారత ఆటగాళ్లు క్వారంటైన్‌ అవుతారు.  

ఇదీ షెడ్యూల్‌...
సిడ్నీలో కరోనా ప్రొటోకాల్‌ ముగిశాక... అక్కడి సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ)లోనే వచ్చే నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలు జరుగుతాయి. ఆఖరి వన్డే కాన్‌బెర్రాలోని మనుక ఓవల్‌ మైదానంలో డిసెంబర్‌ 1న జరుగుతుంది. ఇదే వేదికపై 4న తొలి టి20 నిర్వహిస్తారు. మిగతా రెండు పొట్టి మ్యాచ్‌ల్ని మళ్లీ సిడ్నీలో నిర్వహిస్తారు. 6, 8 తేదీల్లో ఎస్‌సీజీలో రెండు, మూడో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక నాలుగు టెస్టుల సిరీస్‌ పింక్‌బాల్‌తో మొదలవుతుంది. డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు అడిలైడ్‌ ఓవల్‌లో తొలి డేనైట్‌ టెస్టు జరుగుతుంది. బాక్సింగ్‌ డే టెస్టు 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. అప్పుడు కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విక్టోరియా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తే ‘బాక్సింగ్‌ డే’ టెస్టు వేదికను అడిలైడ్‌ ఓవల్‌కు మారుస్తారు. ఇది బ్యాకప్‌ వేదికైనా డేనైట్‌ టెస్టు కాదు. మూడో టెస్టు జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీలో, చివరి టెస్టు జనవరి 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్‌లో జరుగుతాయి. 

మరిన్ని వార్తలు