FIFA WC 2022: భారతీయుల అభిమానానికి మెస్సీ ఫిదా..

17 Nov, 2022 14:06 IST|Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ మెస్సీకి వీరాభిమానులు చాలా మందే. కేవలం మెస్సీ ఆటను చూడడం కోసమే చాలా మంది భారత అభిమానులు ఖతార్‌ చేరుకున్నారు.  మాములుగానే మెస్సీ ఎక్కడికైనా వస్తున్నాడంటే అక్కడ వాలిపోయే అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడి కోసం గంటల కొద్దీ నిరీక్షించడం చూస్తూనే ఉంటాం.

మరి అలాంటిది ప్రతిష్టాత్మక​ ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడేందుకు జట్టుతో కలిసి ఖతార్‌కు వస్తున్నాడంటే ఇక ఆ నిరీక్షణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెస్సీ బృందం ఖతార్‌లో అడుగుపెట్టింది. అయితే అక్కడ ఉన్న వందల మంది అభిమానుల్లో భారతీయులే ఎక్కువగా ఉండడం విశేషం. మెస్సీ బస్సు నుంచి దిగగానే ఇండియన్స్‌ పెద్ద ఎత్తున డ్రమ్స్‌ వాయించి అతనికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఇచ్చారు. ఇది చూసిన మెస్సీ మొహం సంతోషంతో వెలిగిపోయింది. తనకోసం కొన్ని గంటల నుంచి నిరీక్షిస్తున్నారన్న సంగతి తెలుసుకున్నాకా వారిపై ప్రేమ మరింత పెరిగిన మెస్సీ ముద్దుల వర్షం కురిపించాడు.

ఇక గురువారం తెల్లవారుజామునే అర్జెంటీనా జట్టు దుబాయ్‌ నుంచి ఖతార్‌కు చేరుకుంది. అంతకముందు బుధవారం రాత్రి యూఏఈతో జరిగిన చివరి వార్మప్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో విజయాన్ని అందుకుంది. ఒక గోల్‌ చేసిన మెస్సీ తన 91వ అంతర్జాతీయ గోల్‌ను అందుకున్నాడు.ఇక గ్రూప్‌-సీలో ఉన్న అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌ను వచ్చే మంగళవారం సౌదీ అరేబియాతో ఆడనుంది. కాగా ఇదే గ్రూప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియాలతో పాటు మెక్సికో, పొలాండ్‌లు కూడా ఉన్నాయి. 

మెస్సీకి బహుశా ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్‌ అయ్యే అవకాశం ఉంది. మెస్సీ వయస్సు ప్రస్తుతం 35 ఏళ్లు. మరో సాకర్‌ సమరం జరగడానికి నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మెస్సీ ఆడడం కష్టమే. అందుకే మెస్సీ ఈసారి ఎలాగైనా అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1986లో డీగో మారడోనా నేతృత​ంలో ఫుట్‌బాల్‌ ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన అర్జెంటీనా మరోసారి విజేత కాలేకపోయింది.

చదవండి: ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా?

మరిన్ని వార్తలు