Indian Women Boxers: సప్త స్వర్ణాలు

23 Apr, 2021 05:03 IST|Sakshi

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ టోర్నీలో ఏడు పసిడి పతకాలు నెగ్గిన భారత మహిళా బాక్సర్లు  

న్యూఢిల్లీ: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత బాక్సర్లు తమ విశ్వరూపం ప్రదర్శించారు. బరిలోకి దిగిన ఏడు వెయిట్‌ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు విసిరిన పంచ్‌లకు పసిడి పతకాలు వచ్చాయి. పోలాండ్‌లో గురువారం జరిగిన ఫైనల్స్‌లో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు గీతిక (48 కేజీలు), బేబీరోజీసనా చాను (51 కేజీలు), పూనమ్‌ (57 కేజీలు), వింకా (60 కేజీలు), అరుంధతి (69 కేజీలు), థోక్‌చోమ్‌ సనమచ చాను (75 కేజీలు), అల్ఫియా పఠాన్‌ (ప్లస్‌ 81 కేజీలు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

2017 ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అత్యధికంగా ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. ఫైనల్స్‌లో గీతిక 5–0తో నటాలియా (పోలాండ్‌)పై... బేబీరోజీసనా 5–0తో వలేరియా లింకోవా (రష్యా)పై... పూనమ్‌ 5–0తో స్థెలిన్‌ గ్రాసీ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. వింకా పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుల్‌దిజ్‌ (కజకిస్తాన్‌) ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ చివరి రౌండ్‌ పూర్తి కాకుండానే బౌట్‌ను నిలిపి వేశారు.

అరుంధతి 5–0తో బార్బరా (పోలాండ్‌)పై... సనమచ చాను 3–2తో డానా డిడే (కజకిస్తాన్‌)పై... అల్ఫియా 5–0తో దరియా కొజోరెజ్‌ (మాల్దొవా)పై విజయం సాధించారు. శుక్రవారం జరిగే పురుషుల విభాగం ఫైనల్లో భారత్‌ తరఫున సచిన్‌ సివాచ్‌ (56 కేజీలు) బరిలో ఉన్నాడు.  

మరిన్ని వార్తలు