Most Searched Sportsperson: ఒక ఫుట్‌బాల్‌ ఆటగాడి కోసం ఇంతలా వెతికారా?.. అంతలా ఏముంది

26 Nov, 2022 17:30 IST|Sakshi

2022 ఏడాదిలో గూగుల్‌లో ఏ సెలబ్రిటీని ఎక్కువగా వెతికారనే దానిపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. టాప్‌-10 సెలబ్రిటీ లిస్టులో క్రీడా విభాగం నుంచి ఒక్కడే చోటు సంపాదించాడు. అయితే ఆటకు బ్రాండ్‌ అంబాసిడర్లయిన కోహ్లి, రొనాల్డో, మెస్సీ లాంటి గొప్ప ఆటగాళ్ల కోసం గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతారని వింటుంటాం.

కానీ కోహ్లి, రొనాల్డో, మెస్సీలను కాదని పెద్దగా పరిచయం లేని ఆటగాడి కోసం గూగుల్‌లో ఎక్కువగా వెతికారంటూ సెలెబ్‌టాట్లర్‌ తన కథనంలో పేర్కొంది. మరి ఆ వక్తి ఎవరో తెలుసా.. నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌(NFL)లో ప్రాచుర్యం పొందిన టామ్‌ బ్రాడీ అనే ఆటగాడు. అమెరికాలో పాపులర్‌ గేమ్‌ అయిన నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌)లో టామ్‌ బ్రాడీ స్టార్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

45 ఏళ్ల టామ్‌ బ్రాడీ ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. మరి ఇంతలా టామ్‌ బ్రాడీ కోసం గూగుల్‌లో ఎందుకు వెతికార్రా అని ఆరా తీస్తే.. అదంతా సూపర్‌ మోడల్‌గా పేరు పొందిన తన భార్య గిసెల్ బుండ్చెన్‌తో విడాకుల వ్యవహారం అతన్ని టాప్‌ లిస్ట్‌లో చోటు దక్కేలా చేసింది. మొత్తంగా 2022 ఏడాదిలో టామ్‌ బ్రాడీ కోసం 4.06 మిలియన్‌ సార్లు సెర్చ్‌ చేసినట్లు సెలెబ్‌టాట్లర్‌ తెలిపింది.

ఇక ఓవరాల్‌గా టాప్‌-10 జాబితాలో తొలి స్థానంలో అంబర్‌ హెడ్‌(5.6 మిలియన్‌).. రెండో స్థానంలో హాలీవుడ్‌ స్టార్‌ జానీ డెప్‌(పైరెట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌ ఫేమ్‌) ఉండగా.. మూడో స్థానంలో దివంగత బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ ఉన్నారు. నాలుగో స్థానంలో టామ్‌ బ్రాడీ ఉండగా.. కిమ్‌ కర్‌దషియన్‌ ఐదు, పిటే డేవిడ్‌సన్‌ ఆరో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఎలన్‌ మస్క్‌, విల్‌ స్మిత్‌, మిల్లీ బ్రౌన్‌, జెండాయాలు ఉన్నారు.

చదవండి: 'కొకైన్‌ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే'

మరిన్ని వార్తలు