Asian Games: అట్టహాసంగా ఆరంభమైన ఆసియా క్రీడలు.. తెలుగు క్రీడాకారులు వీరే

23 Sep, 2023 19:17 IST|Sakshi

Asian Games 2023 Opening Ceremony: చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలకు తెర లేచింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శనివారం సాయంత్రం ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. 19వ ఆసియా క్రీడల ఆరంభోత్సవంలో.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళా స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ భారత బృందానికి పతాకధారులుగా వ్యవహరించారు.

సంప్రదాయ దుస్తుల్లో
ఈ వేడుకలో భారత క్రీడాకారులంతా ఖాఖీ రంగు ప్రధానంగా ఉన్న సంప్రదాయ దుస్తులు ధరించారు. మహిళా ప్లేయర్లు చీరలో మెరిసిపోగా.. పురుష క్రీడాకారులు కుర్తా.. పైజామా ధరించి హుందాగా కనిపించారు. 

చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆసియా క్రీడల ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షుడు జావో ఝిదాన్‌, ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈసారి క్రికెట్‌ జట్లు కూడా
ఇక ఈసారి భారత్‌ నుంచి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అథ్లెట్ల, హాకీ జట్లతో పాటుగా.. భారత మహిళా, పురుష క్రికెట్‌ జట్లు తొలిసారిగా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనబోతున్నాయి.

ఇప్పటి వరకు 18 ఆసియా క్రీడల్లో పోటీపడి భారత్‌ మొత్తంగా 671 పతకాలు గెలవగా.. ఇందులో కేవలం 155 మాత్రమే స్వర్ణాలు ఉన్నాయి. అత్యధికంగా 316 కాంస్యాలు భారత్‌ ఖాతాలో ఉన్నాయి. అయితే, ఈసారి ఒలింపిక్స్‌ గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు.

ఇదిలా ఉంటే.. ఆతిథ్య చైనా ఇప్పటి వరకు ఏ​కంగా 3187 పతకాలు గెలిచి తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగిపోతోంది. ఇక హాంగ్జౌ ఏసియన్‌ గేమ్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 30 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి..
ధీరజ్‌ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్‌), కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాతి్వక్‌ సాయిరాజ్‌ (బ్యాడ్మింటన్‌), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్‌), నేలకుడితి అనూష (సాఫ్ట్‌ టెన్నిస్‌), సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్‌), బారెడ్డి అనూష (క్రికెట్‌), శివ కుమార్‌ (సెపక్‌తక్రా). 

తెలంగాణ నుంచి..
వ్రితి అగర్వాల్‌ (స్విమ్మింగ్‌), అగసార నందిని (అథ్లెటిక్స్‌), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్‌), నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్‌), కైనన్‌ చెనాయ్, ఇషా సింగ్‌ (షూటింగ్‌), ఆకుల శ్రీజ (టేబుల్‌ టెన్నిస్‌), ఇరిగేశి అర్జున్‌ (చెస్‌), ప్రీతి కొంగర (సెయిలింగ్‌), బత్తుల సంజన (స్కేటింగ్‌), గుగులోత్‌ సౌమ్య (ఫుట్‌బాల్‌), తిలక్‌ వర్మ (క్రికెట్‌).

మరిన్ని వార్తలు