డిస్కస్‌ త్రోయర్‌ కమల్‌ప్రీత్‌పై మూడేళ్ల నిషేధం

13 Oct, 2022 01:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళా డిస్కస్‌ త్రోయర్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) మూడేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు పడింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది.

ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్‌ప్రీత్‌ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా ‘పాజిటివ్‌’ అని తేలడంతో అదే నెల 29న సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో ఆమె భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది.  

మరిన్ని వార్తలు