Kylian Mbappe: ఫ్రాన్స్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపె కొత్త చరిత్ర..

5 Mar, 2023 09:08 IST|Sakshi

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ సంచలనం కైలియన్‌ ఎంబాపె చరిత్ర సృష్టించాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్‌-సెయింట్‌ జెర్మెన్‌(పీఎస్‌జీ) జట్టు తరపున ఆల్‌టైమ్‌ లీడింగ్‌ గోల్‌ స్కోరర్‌గా నిలిచాడు. శనివారం అర్థరాత్రి నాంటెస్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంబాపె ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఆట (90+2వ నిమిషం) అదనపు సమయంలో గోల్‌ కొట్టిన ఎంబాపెకు ఇది 201వ గోల్‌ కావడం విశేషం.

ఈ నేపథ్యంలో ఎంబాపె పీఎస్‌జీ తరపున అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పీఎస్‌జీ తరపున 200 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఎడిసన్‌ కవానీని వెనక్కి నెట్టిన ఎంబాపె తొలిస్థానాన్ని అధిరోహించాడు. ఎడిసన్‌ కవానీ 2013 నుంచి 2022 వరకు పీఎస్‌జీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఇక ఎంబాపె అనగానే ముందుగా గుర్తుకువచ్చేది గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ 2022. అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లో హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిసిన ఎంబాపె ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకానొక దశలో ఫ్రాన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చినప్పటికి అదనపు సమయంలో మ్యాచ్‌ డ్రాగా ముగియడం.. పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ సేన విజయం సాధించడం జరిగిపోయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పారిస్‌-సెయింట్‌ జెర్మెన్‌(పీఎస్‌జీ) నాంటెస్‌ క్లబ్‌పై 4-2 తేడాతో విజయం సాధించింది. పీఎస్‌జీ తరపున మెస్సీ(12వ నిమిషం), జావెన్‌ హజమ్‌(17వ నిమిషం), డానిల్లో పెరీరా(60వ నిమిషం), కైలియన్‌ ఎంబాపె(90+2 వ నిమిషం)లో గోల్స్‌ చేయగా.. నాంటెస్‌ క్లబ్‌ తరపున లుడోవిక్‌ బ్లాస్‌(31వ నిమిషం), ఇగ్నాషియస్‌ గాంగో(38వ నిమిషం) గోల్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు