Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు

15 Sep, 2021 01:41 IST|Sakshi

క్రికెట్‌కు గుడ్‌బై పలికిన శ్రీలంక స్టార్‌ లసిత్‌ మలింగ

కొలంబో: ‘యార్కర్‌ కింగ్‌’ లసిత్‌ మలింగ తన ఆటను ముగించాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. ఈ శ్రీలంక స్టార్‌ బౌలర్‌ వన్డేల నుంచి గతంలోనే తప్పుకొని టి20ల్లో మాత్రమే కొనసాగుతూ రాగా, ఇప్పుడు పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు  వెల్లడించాడు. నిజానికి గత ఏడాదే టి20 ప్రపంచకప్‌లో లంక తరఫున ఆడిన అనంతరం వీడ్కోలు పలకాలని భావించినా... కరోనా కారణంగా టోర్నీ వాయిదా పడటంతో ఆ అవకాశం రాలేదు. తమ జాతీయ జట్టు తరఫున మలింగ 2020 మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. వ్యక్తిగత కారణాలతో 2020 సీజన్‌ నుంచే అతను ఐపీఎల్‌కూ దూరమయ్యాడు. 2004లో టెస్టు క్రికెట్‌తో అరంగేట్రం చేసిన మలింగను వరుస గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో 2011లోనే అతను టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పూర్తిగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లపైనే దృష్టి పెట్టాడు. 

ప్రత్యేక శైలితో... 
భిన్న రంగులతో రింగులు తిరిగిన జుట్టు, బంతిని ముద్దాడిన తర్వాతే మొదలయ్యే రనప్, గతంలో ఎన్నడూ చూడని ‘రౌండ్‌ ఆర్మ్‌’ బౌలింగ్‌ యాక్షన్‌ మలింగను సగటు క్రికెట్‌ అభిమాని భిన్నంగా గుర్తు పెట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా ‘45 డిగ్రీల’ యాక్షన్‌ కారణంగా మలింగ వేసే యార్కర్లు బుల్లెట్లలా దూసుకొస్తుంటే ఆడలేక బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడం లెక్కలేనన్ని సార్లు జరిగింది. వాటికి వేగం తోడైతే అవి మరింత ప్రమాదకరంగా మారి మలింగ స్థాయి ఏమిటో చూపించాయి. యార్కర్లు మాత్రమే కాకుండా తర్వాతి రోజుల్లో మలింగ స్లో బాల్, స్లో బౌన్సర్‌లను అద్భుతంగా వేయడం నేర్చుకొని ప్రత్యర్థులను పడగొట్టాడు. డెత్‌ ఓవర్లలో అతనికంటే మెరుగైన రికార్డు మరే బౌలర్‌కు లేదు. గత దశాబ్ద కాలంలో పరిమిత ఓవర్లలో శ్రీలంక జట్టుకు అతని అనేక విజయాలు అందించాడు. 2009, 2012 టి20 ప్రపంచకప్‌ జట్లలో భాగంగా ఉన్న మలింగ కెప్టెన్సీలోనే 2014లో శ్రీలంక టి20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలవడం విశేషం. సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్‌లాంటి స్టార్లు ఉన్నా ... 2007 నుంచి 2014 మధ్య లంక జట్టు ఐసీసీ టోర్నీ లో మంచి ప్రదర్శన కనబర్చడంలో అతనిదే కీలకపాత్ర. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా ఐదు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన అరుదైన రికార్డు అతని పేరిటే ఉంది.

ఐపీఎల్‌లో సూపర్‌... 
శ్రీలంక తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసిన మలింగ భారత అభిమానులకు ఐపీఎల్‌ ద్వారా మరింత చేరువయ్యాడు. ముంబై ఇండియన్స్‌ 4 సార్లు (2013, 2015, 2017, 2019) ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలవడంలో అతను ప్రధాన భూమిక పోషించాడు. ఈ లీగ్‌లో 2009 నుంచి 11 సీజన్ల పాటు అతను ఒకే ఒక జట్టు ముంబైకే ప్రాతినిధ్యం వహించాడు. 122 ఐపీఎల్‌లో మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఓవరాల్‌గా 295 టి20ల్లో అతను 7.07 ఎకానమీతో 390 వికెట్లు తీశాడు.

కెరీర్‌ విశేషాలు
వన్డేల్లో 3 హ్యాట్రిక్‌లు
టి20ల్లో 2 హ్యాట్రిక్‌లు
అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (107) తీసిన బౌలర్‌
2014 టి20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్‌
4 వరుస బంతుల్లో 4 వికెట్లు రెండు సార్లు తీసిన అరుదైన ఘనత 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు