PV Sindhu: నేనూ ట్రోలింగ్‌కు గురయ్యా.. పీవీ సింధు కీలక వ్యాఖ్యలు

29 Jan, 2022 20:32 IST|Sakshi

PV Sindhu Comments On Cyber Bullying And Trolling: సైబర్‌ నేరాలపై మహిళలు, పిల్లలను చైతన్య పరిచేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత స్టార్‌ షట్లర్‌, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీవీ సింధు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను చాలా సందర్భాల్లో ట్రోలింగ్‌కు, సైబర్ బుల్లియింగ్‌కు గురయ్యానని ఆమె వెల్లడించారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని, మహిళలు, పిల్లలు కూడా ఇలాంటి సందర్భాల్లో అధైర్యపడకుండా పోలీసుల సహకారంతో సైబర్‌ అటాక్‌లకు చెక్‌ పెట్టాలని పిలుపునిచ్చారు. 

ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్ నేరాలు భారీగా పెరిగాయని, ఇందులో ప్రధానంగా మహిళలు, పిల్లలే బలవుతున్నారని వాపోయారు. ఆన్‌లైన్‌ క్లాసుల నేపథ్యంలో తల్లిదండ్రులు నిరంతరం పిల్లలను గమనిస్తూ ఉండాలని, వారు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వాటిని అధిగమించేందుకు అందుకు తగిన చైతన్యం వారిలో నింపాలని సూచించారు.

మహిళల భద్రతకు షీ టీమ్స్‌ లాగే, సైబర్ మోసాలకు సైబర్ వారియర్లు ఉన్నారనే విషయాన్ని గుర్తించాలని కోరారు. సైబర్ నేరాల బారిన పడిన వారు నిస్సంకోచంగా సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఐజీ బి సుమతి పాల్గొన్నారు. 
చదవండి: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్‌ ప్లేయర్‌కు భారీ జరిమానా
 

మరిన్ని వార్తలు