ఏమిటీ యో–యో టెస్టు? 

25 Sep, 2020 02:53 IST|Sakshi

కోహ్లిని అడిగిన ప్రధాని మోదీ

ఫిట్‌నెస్‌పై ఇష్టాగోష్టి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘ఫిట్‌నెస్‌’ మంత్ర తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం సరైనోడినే ఎంచుకున్నారు. అతను తమ జట్టు ఫిట్‌నెస్‌ గురించి, పెట్టే పరీక్ష గురించి వివరంగా దేశ ప్రధానికి వివరించాడు. మోదీ తెలుసుకున్నది ‘యో–యో’ టెస్టు గురించి అయితే... అడిగింది కోహ్లిని! ‘ఫిట్‌ ఇండియా మూమెంట్‌’ మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని పలువురు ఆటగాళ్లు, ఫిట్‌నెస్‌ నిష్ణాతులతో వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ వర్చువల్‌ ఇష్టాగోష్టిలో ప్రముఖ మోడల్, ఫిట్‌నెస్‌లోనే ఎవరెస్ట్‌ అయిన మిలింద్‌ సోమన్, పోషకాహార నిపుణులు రుజుత దివేకర్, పారాలింపిక్‌ జావెలిన్‌ చాంపియన్‌ దేవేంద్ర జజారియా, కశ్మీర్‌కు చెందిన మహిళా ఫుట్‌బాలర్‌ అఫ్షాన్‌ ఆషిక్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా లైన్‌లోకి కోహ్లి వచ్చాడు. అతను ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్‌ ఆడుతున్నాడు. వెంటనే మోదీ ‘నేను ఈ మధ్య యో–యో టెస్టు గురించి విన్నాను. అసలేంటి ఈ పరీక్ష?’ అని అడిగారు. కోహ్లి నవ్వుతూ ఆ టెస్టు సంగతి వివరించాడు.

‘ఉత్తమ ఫిట్‌నెస్‌కు ఇది ముఖ్యమైన పరీక్ష. ప్రపంచ దేశాల ఫిట్‌నెస్‌ స్థాయితో పోల్చుకుంటే మన ఫిట్‌నెస్‌ దిగదుడుపే. అందుకే మనం కూడా ఫిట్‌నెస్‌లో నిరూపించుకోవాలనుకున్నాం. ఇందుకు అత్యుత్తమ ప్రామాణిక పరీక్ష అయిన యో–యోను ఎంచుకున్నాం’ అని అన్నాడు. కెప్టెన్‌ అయినా సరే, ఈ టెస్టులో ఫెయిల్‌ అయితే తనను కూడా  సెలక్షన్‌కు పరిగణించరని కోహ్లి ప్రధానికి వివరించాడు. కెరీర్‌ ఆరంభంలో తాను ఫిట్‌నెస్, డైట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టలేదని, ఇప్పుడు మాత్రం తనతో పాటు భారత జట్టులో కూడా మార్పు వచ్చిందని అతను ప్రధానికి చెప్పాడు. విజయాల కోసం ప్రతిభపైనే ఆధారపడలేమని, ఫిట్‌గా ఉండటం కూడా కీలకమని కోహ్లి అన్నాడు. ప్రతీ రోజూ మెడిటేషన్‌ చేసే తాను...మైదానంలో ప్రశాంతంగా ఉండటం ధోనిని చూసి నేర్చుకున్నానని అఫ్షాన్‌ చెప్పింది. చివరగా మోదీ మాట్లాడుతూ...‘ఫిట్‌నెస్‌ కీ డోస్‌...ఆధా ఘంటా రోజ్‌’ అంటూ రోజూ కనీసం అర గంట ఫిట్‌నెస్‌ కోసం సమయం కేటాయించాలంటూ ఉపదేశించి ముగించారు.  

మరిన్ని వార్తలు