Rahul Dravid: ఎన్‌సీఏ డైరెక్టరా లేక టీమిండియా కోచ్‌ పదవా..?

11 Aug, 2021 10:45 IST|Sakshi

ముంబై: జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ) డైరెక్టర్​ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను చివరి తేదీగా ప్రకటించింది. ప్రస్తుతం ఎన్​సీఏ డైరెక్టర్​గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్​ ద్రవిడ్ మరోసారి ఈ పదవికి దరఖాస్తు చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్​సీఏ డైరెక్టర్​గా ద్రవిడ్‌ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమే. 

ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ధవన్‌ సేనకు ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ పరిమిత ఓవర్ల పర్యటనలో ద్రవిడ్‌ ప్రభావం నామమాత్రమే అయినా.. అతన్ని భవిష్యత్తు టీమిండియా హెడ్‌ కోచ్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​ తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్​ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. రవిశాస్త్రి పదవీకాలాన్ని బీసీసీఐ పొడించడం దాదాపు అసాధ్యమే. 

ఈ నేపథ్యంలో ఎన్​సీఏగా డైరెక్టర్‌గా, భారత్-ఏ, అండర్​-23, అండర్​-19, అండర్​-16 జట్ల కోచ్‌గా పని చేసిన అనుభవమున్న ద్రవిడ్‌ వైపు బోర్డు మొగ్గు చూపే అవకాశం ఉంది. ది వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకోవడం, ఇండియా రిజర్వ్​ బెంచ్​ను బలంగా తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించడం ద్రవిడ్‌కు కలిసొచ్చే అంశాలు. అందులోనూ ద్రవిడ్‌ సహచరుడు సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ బాస్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టీమిండియా నూతన హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు స్పష్టమవుతోంది.  

మరిన్ని వార్తలు