Ranji Trophy 2022: మరో శతకం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్‌ క్రీడా మంత్రి

15 Jun, 2022 21:31 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బెంగాల్‌ జట్టు ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బెంగాల్‌ను సీనియర్‌ ఆటగాడు, రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్‌ తివారి (84 నాటౌట్‌), బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ (72 నాటౌట్‌) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వీరిద్దరూ ఆరో వికెట్‌ను అబేధ్యమైన 143 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ హిమాన్షు మంత్రి (165) మధ్యప్రదేశ్‌ భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ ఇంకా 144 పరుగులు వెనుక పడి ఉంది. మధ్యప్రదేశ్‌ బౌలర్లు కుమార్‌ కార్తీకేయ (2/43), పూనీత్‌ దాటే (2/34) బెంగాల్‌ను దారుణంగా దెబ్బ తీశారు. 

మరో శతకం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్‌ క్రీడా మంత్రి
ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మైదానంలోనూ సత్తా చాటుతున్నాడు బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి. జార్ఖండ్‌తో జరిగిన తొలి క్వారర్‌ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ (73), రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (136) బాదిన తివారి.. తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లోనూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరో శతకం దిశగా దూసుకెళ్తున్నాడు.

అతనికి మరో ఎండ్‌లో షాబాజ్‌ అహ్మద్‌ సహకరిస్తున్నాడు. వీరిద్దరు మూడో రోజు ​కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించి మధ్యప్రదేశ్‌పై  ఆధిక్యం సాధించగలిగితే, తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ ఆధారంగా బెంగాల్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో ముంబై-ఉత్తర్‌ ప్రదేశ్ జట్లు‌ తలపడుతున్నాయి.
చదవండి: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా

మరిన్ని వార్తలు