Sehwag-Akhtar: ఏదో ఒకరోజు సెహ్వాగ్‌ చెంప చెళ్లుమనిపిస్తా: అక్తర్‌

18 Mar, 2022 10:24 IST|Sakshi

టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరు డాషింగ్‌ ఓపెనర్‌గా పేరు పొందితే.. మరొకరు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరు సాధించాడు. ఈ ఇద్దరు మైదానంలో ప్రత్యర్థులుగా తలపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీరిద్దరి ఆటను అభిమానులు బాగానే ఎంజాయ్‌ చేసేవారు. ఆన్‌ఫీల్డ్‌లో ప్రత్యర్థులైనప్పటికీ.. ఆఫ్‌ఫీల్డ్‌లో మాత్రం మంచి స్నేహితులుగా మెలిగారు.

బయట ఈ ఇద్దరు ఎక్కడ కలిసినా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా గడిపేవారు. ఒకసారి సెహ్వాగ్‌ బట్టతలపై అక్తర్‌ కామెంట్‌ చేశాడు. మరో సందర్భంలో ఒకపార్టీ సందర్బంగా అక్తర్‌ సూట్‌, టై కట్టుకొని వెళ్లాడు. కాగా ఇది చూసిన సెహ్వాగ్‌.. అచ్చం వెయిటర్‌లా కనిపిస్తున్నావు అని కామెంట్‌ చేశాడు. ఇలాంటి సరదా సందర్బాలు చాలానే ఉన్నాయి.


తాజాగా అక్తర్‌ యూట్యూబ్‌ వేదికగా జరిగిన ఒక స్టాండప్‌ కమెడియన్‌ షోలో పాల్గొన్నాడు. తన్మయ్‌ భట్‌, అక్తర్‌ల మధ్య సంభాషణ హైలెట్‌గా నిలిచింది. ఆద్యంతం నవ్వులు విరిసిన ఈ షోలో షోయబ్‌ ఆఖరున ఒక మాట అన్నాడు. ''నాకు ఒక కోరిక మిగిలిపోయింది.. ఏదో ఒకరోజు నా ప్రియ మిత్రుడు సెహ్వాగ్‌ చెంపను గట్టిగానే చెళ్లుమనిపిస్తా'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా దీనిపై సెహ్వాగ్‌ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్‌ లేదు. సెహ్వాగ్‌ స్పందిస్తాడో లేదో చూడాలి.


టీమిండియా తరపున 2001లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సెహ్వాగ్‌ 251 వన్డేల్లో 8273 పరుగులు, 104 టెస్టుల్లో 8586 పరుగులు, 19 టి20ల్లో 394 పరుగులు చేశాడు. తన దూకుడైన ఆటతీరుతో డాషింగ్‌ ఓపెనర్‌గా ముద్రపడిన సెహ్వాగ్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక 2007టి 20, 2011 వన్డే వరల్డ్‌కప్‌ సాధించిన టీమిండియా జట్టులో సెహ్వాగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్‌ తరపున ఫాస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన షోయబ్‌ అక్తర్‌ 163 వన్డేల్లో 247 వికెట్లు, 46 టెస్టుల్లో 178 వికెట్లు, 15 టి20ల్లో 19 వికెట్లు తీశాడు. 

చదవండి: IPL 2022: కప్‌ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు

PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే

Ranji Trophy 2022: ధోని హోం టీమ్‌ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం

మరిన్ని వార్తలు