India Vs England: టెస్టుల్లో చరిత్ర సృష్టించిన పంత్‌.. తొలి వికెట్‌ కీపర్‌గా..!

2 Jul, 2022 12:18 IST|Sakshi

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బస్టన్‌ వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 89 బంతుల్లోనే సెంచరీ చేసిన పంత్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఫాస్టస్ట్‌ సెంచరీ సాధించిన భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ రికార్డుల కెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌ ఎంస్‌ ధోని పేరిట ఉండేది. 2006లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ధోని 93 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఇక టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో పంత్‌ తన విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై పంత్‌ ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ను పంత్‌ టార్గెట్‌ చేశాడు. ఈ క్రమంలో పంత్‌ టెస్టుల్లో ఐదో శతకం నమోదు చేశాడు. ఇక రవీంద్ర జడేజాతో కలిసి పంత్‌ ఆరో వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఇన్నింగ్స్‌ 67 ఓవర్‌ వేసిన రూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కొల్పోయాడు.

ఈ మ్యాచ్‌లో పంత్‌ 111 బంతుల్లో 146 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు,4 సిక్స్‌లు ఉన్నాయి. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి  338 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(83),షమీ ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ మరి కొన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏంటో పరిశీలిద్దాం.

89 బం‍తుల్లో సెంచరీ సాధించిన పంత్‌.. టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.
విదేశాల్లో ఒకే ఏడాదిలో రెండు సెంచరీలో సాధించిన తొలి వికెట్‌ కీపర్‌ కూడా పంత్‌ కావడం విశేషం.
టెస్టు క్రికెట్ చరిత్రలో 2000 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు.
ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీని సాధించిన ఆటగాడిగా పంత్‌ రికార్డులకెక్కాడు.
ఇంగ్లండ్ గడ్డపై రెండవ వేగవంతమైన టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు.
2018లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి పంత్ ఇప్పుడు ఐదు సెంచరీలు సాధించాడు. ఈ వ్యవధిలో మరే ఇతర వికెట్ కీపర్ కూడా మూడు కంటే ఎక్కువ సెంచరీలు సాధించ లేదు.
చదవండిIndia Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్‌: పంత్‌పై ప్రశంసల జల్లు

>
మరిన్ని వార్తలు