బబితా ఫోగాట్‌ సోదరి ఆత్మహత్య

18 Mar, 2021 10:28 IST|Sakshi
ఆత్మహత్య చేసుకుని మరణించిన రెజ్లర్‌ రితికా ఫోగాట్‌ (ఫైల్‌ ఫోటో)

రెజ్లింగ్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌లో 1 పాయింట్‌ తేడాతో ఓటమి

ఓటమి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రితికా

గత ఐదేళ్లుగా మహావీర్‌ ఫోగాట్‌ దగ్గర శిక్షణ

న్యూఢిల్లీ: ఆటలన్నాక గెలుపు ఓటములు సహజం. ఓడిపోతే.. అంతటితో మన కథ ముగిసినట్లు కాదు. మరింత కసిగా ప్రయత్నించి గెలుపు అంతేంటో చూడాలి. అంతేతప్ప ఓడిపోయామని చెప్పి ప్రాణాలు తీసుకోవడం దారుణం. ఈ విషయం రితికాకు తెలియక కాదు. కానీ ఓడిపోయిన ఆ క్షణం ఆమె మనసు తనను స్థిమితంగా ఉండనివ్వలేదు. దాంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది ప్రముఖ మహిళా రెజ్లర్‌ బబితా ఫోగాట్‌ సోదరి (కజిన్‌ సిస్టర్‌) రితికా ఫోగాట్‌. ఈ సంఘటన యావత్‌ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఒక్క చిన్న ఓటమికే తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

వివరల్లోకి వెళితే.. 17 ఏళ్ల రితికా ఫోగాట్‌ మహావీర్‌ ఫోగాట్‌ అకాడమీలో గత ఐదేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో రితికా తాజాగా భరత్‌పూర్‌లోని లోహ్‌ఘర్‌ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొన్నది. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి మంచి ప్రతిభ కనబరిచిన రితికా ఫైనల్‌కు చేరుకుంది. అయితే మార్చి 14న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో ఓటమిని చవి చూసింది.

దాంతో తీవ్ర నిరాశకు గురైన రితికా.. తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రితికా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం ఈ నెల 16న రితికా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా రితికా సోదరుడు హర్వింద్ర మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమి కాదు. అసలు రితికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియట్లేదు. కోచ్‌ మహావీర్‌, మా తండ్రి మెన్‌పాల్‌ కూడా మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో రితికాతోనే ఉన్నారు. ఓటమి తర్వాత రితికకు భరోసా కూడా ఇచ్చారు. మరింత కష్టపడితే విజయం సొంతమవుతుందని అందరం తనకు నచ్చ చెప్పాం. కానీ రితికా ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహిచంలేకపోయాం’ అంటూ వాపోయాడు. 

ఈ క్రమంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్‌ ఉన్న రితకా ఫోగాట్‌ మృతి చెందింది అనే భయంకర విషయాన్ని వెల్లడించడానికి ఎంతో చింతిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం మారిపోయింది. క్రీడాకారలు మునుపెన్నడు లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలి అనే దాని గురించి ట్రైనింగ్‌ ఇవ్వడం ఎంతో ముఖ్యం’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

ఇదిలా ఉంటే బబితా ఫోగాట్‌తో పాటు ఆమె సోదరీమణులు కూడా రెజ్లింగ్‌లో మేటి ప్లేయర్స్‌ అనే విషయం తెలిసిందే. మహావీర్‌ ఫోగాట్‌ తన కూతుళ్లను మంచి రెజ్లర్స్‌గా తీర్చిదిద్దాడు. వీరి కథ ఆధారంగానే బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో ‘దంగల్‌’ అనే సినిమా తెరకెక్కింది.

చదవండి:

కిమురా ఆకస్మిక మృతి.. షాక్‌లో అభిమానులు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు