Rohit Sharma Birthday Special: హ్యాపీ బర్త్‌డే రోహిత్‌.. ఆ రికార్డు ఇప్పటికీ తన పేరిటే పదిలం!

30 Apr, 2022 11:12 IST|Sakshi

Rohit Sharma Birthday Special: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్‌ 30). అతడు ఈరోజు 35వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టు మాజీ సారథి విరాట్‌ కోహ్లి, మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌, ముంబై ఇండియన్స్‌ యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ సహా పలువురు ఆటగాళ్లు అతడికి విషెస్‌ తెలియజేశారు.

ఇక రోహిత్‌ భార్య రితికా సజ్దే.. ‘‘హ్యాపీ బర్త్‌డే రో.. సమీ.. నిన్ను మేమెంతగానో ప్రేమిస్తున్నాం. మా హకూనా మటాటాగా ఉన్నందుకు థాంక్స్‌’’ అంటూ భర్త రోహిత్‌, కూతురు సమైరా శర్మతో కలిసి ఉన్న ఫొటోలు షేర్‌ చేశారు.

అప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడేమో!
నిజానికి రోహిత్‌ శర్మ కెరీర్‌ను మూడు భాగాలుగా విభజించవచ్చు. తొలుత జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిన వేళ.. ఓపికగా ఒక్కో మెట్టు ఎదుగుతూ... అద్భుత ఆటతీరుతో భారత జట్టు కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు.

కాగా 2013లో అప్పటి టీమిండియా కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. రోహిత్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేయడంతో అతడి దశ తిరిగిందని చెప్పవచ్చు. శిఖర్‌ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన రోహిత్‌... టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలో  సాయపడ్డాడు. ఆ తర్వాత హిట్‌మ్యాన్‌కు వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదంటే అతిశయెక్తి కాదు.

రోహిత్‌ శర్మ బర్త్‌డే సందర్భంగా అతడు సాధించిన ఐదు అద్భుత విజయాలను ఓసారి గమనిద్దాం.
మూడు ద్విశతకాలు
వన్డే ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రోహిత్‌ ఇప్పటి వరకు మూడు డబుల్‌ సెంచరీలు సాధించాడు. తొలుత ఆస్ట్రేలియాపై 2013లో ఈ ఘనత సాధించాడు. 158 బంతుల్లో 16 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 209 పరుగులు చేసి మొదటి ద్విశతకాన్ని నమోదు చేశాడు. 

ఆ తర్వాత శ్రీలంకపై 2014లో రెండో డబుల్‌ సెంచరీ(173 బంతుల్లో 264 పరుగులు) చేశాడు. అనంతరం 2017లో మళ్లీ అదే జట్టుపై 208 పరుగులు సాధించాడు.

ఏకంగా 33 బౌండరీలతో..
శ్రీలంకపై 2014లో చేసిన డబుల్‌ సెంచరీ రోహిత్‌ కెరీర్‌లో మరింత ప్రత్యేకమైనది. ఈ మ్యాచ్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో హిట్‌మ్యాన్‌ 264 పరుగులు(అత్యధిక స్కోరు) సాధించాడు. ఇందులో 186 పరుగులు బౌండరీల సాయంతో పొందినవే.

ప్రపంచకప్‌లో అదరగొట్టి..
ఒక వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ తన పేరును లిఖించుకున్నాడు. 2019 ప్రపంచకప్‌ సమయంలో 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 5 శతకాలు బాదాడు.

అత్యధిక పరుగుల వీరుడు
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 3313 పరుగులు సాధించాడు. 125 మ్యాచ్‌లలో భాగమైన హిట్‌మ్యాన్‌ 117 ఇన్నింగ్స్‌ ఆడి 139.55 స్ట్రైక్‌రేటుతో ఈ మేరకు పరుగులు రాబట్టాడు. ఇందులో 4 సెంచరీలు, 26 అర్ధ శతకాలు ఉన్నాయి. 

వన్డేల్లో అత్యధిక స్కోరు
శ్రీలంకపై నమోదు చేసిన తొలి డబుల్‌ సెంచరీ సందర్భంగా రోహిత్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఇప్పటి వరకు ఒక బ్యాటర్‌కు ఇదే అత్యధిక స్కోరు.(33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 264 పరుగులు).  

రోహిత్‌ కెరీర్‌ గ్రాఫ్‌
►ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు- 400
►అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు సాధించిన పరుగులు- 15,733
వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌
►2007 టీ20 వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన జట్టులో సభ్యుడు
►ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌
►ఇప్పటి వరకు స్వదేశంలో ఆడిన టీ20 మ్యాచ్‌లన్ని క్లీన్‌స్వీప్‌
►ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత

చదవండి👉🏾PBKS Vs LSG: చెత్తగా ఆడారు.. టీమ్‌ను అమ్మిపారేయండి.. అప్పుడే!

A post shared by Ritika Sajdeh (@ritssajdeh)

మరిన్ని వార్తలు