'అతన్ని తిట్టలేదు.. అడ్వైజ్‌ మాత్రమే ఇచ్చాను'

1 Dec, 2020 20:47 IST|Sakshi

కొలంబొ : లంక ప్రీమియర్‌ లీగ్‌ 2020లో గాలే గ్లాడియేటర్స్‌ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది ఆఫ్ఘన్‌ బౌలర్‌ నవీన్‌ హుల్‌ హక్‌ను బహిరంగంగా దూషించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆఫ్రిది మంగళవారం ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ' నేను నవీన్‌ హుల్‌ హక్‌ను తిట్టలేదు. షేక్‌ హ్యాండ్‌ సందర్భంగా నవీన్‌ దగ్గరికి వచ్చినప్పుడు సీరియస్‌ అయిన మాట వాస్తవమే. మ్యాచ్‌లో ఉన్నంతసేపు ఆటపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకోకూడదని సూచనలు మాత్రమే ఇచ్చాను. అంతేగాని అతనిపై ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు. నాకు ఆఫ్ఘన్‌ ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. మనం ఒక జట్టులో ఉన్నామంటే  సహచరులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా గౌరవించడమనేది ఆటలో కనీస ధర్మం. అంటూ వివరణ ఇచ్చాడు. (చదవండి : ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం)

కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కాండీ టస్కర్స్‌ బ్రెండన్‌ టేలర్‌, కుషాల్‌ మెండిస్‌ బ్యాటింగ్‌లో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్‌ 171 పరుగుల వద్దే ఆగిపోయింది. దనుష్క గుణతిలక ఒక్కడే 53 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ ఆఫ్రిది గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్రిది నాయకత్వంలోని గ్లాడియేటర్స్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ ఓడిపోయి చివరిస్థానంలో ఉండగా.. టస్కర్స్‌ మాత్రం తొలి విజయం నమోదు చేసింది. కాగా ఎల్‌పీఎల్‌లో మొదటిస్థానంలో జఫ్నా స్టాలియన్స్‌ మొదటిస్థానంలో ఉండగా.. కొలంబొ కింగ్స్‌ రెండో స్థానంలో కొనసాగుతుంది.

>
మరిన్ని వార్తలు