SL VS IRE 1st Test: 5 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వచ్చీ రావడంతోనే సెంచరీ, మొత్తం నలుగురు..!

17 Apr, 2023 15:31 IST|Sakshi

2 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే​ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య శ్రీలంక​ భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. 386/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించి, 591/6 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి రోజు ఆటలో కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (179), వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ (140) భారీ శతకాలు బాదగా.. రెండో రోజు దినేశ్‌ చండీమాల్‌ (102 నాటౌట్‌), సమరవిక్రమ (104 నాటౌట్‌) శతక్కొట్టారు.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించగా.. టెస్ట్‌ల్లో శ్రీలంక ఈ ఫీట్‌ను సాధించడం ఇది నాలుగోసారి. కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సదీరా సమరవిక్రమ ఓ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత లంక టెస్ట్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సమరవిక్రమ.. వచ్చీరాగానే  శతకం బాదాడు. ఈ మ్యాచ్‌కు ముందు 4 టెస్ట్‌లు ఆడి కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయకపోవడంతో జట్టులో చోటు కోల్పోయిన సమర.. ఐర్లాండ్‌తో తొలి టెస్ట్‌లో 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తొలి సెంచరీ నమోదు చేశాడు. 

సనత్‌ జయసూర్య, ఏంజెలో మాథ్యూస్‌ సరసన చండీమాల్‌..
రెండో రోజు ఆటలో సెంచరీ చేసిన దినేశ్‌ చండీమాల్‌, కెరీర్‌లో 14వ శతకాన్ని నమోదు చేసి లంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య సరసన చేరాడు. టెస్ట్‌ల్లో  లంక తరఫున జయసూర్యతో పాటు ఏంజెలో మాథ్యూస్‌ కూడా 14 సెంచరీలు బాదారు. తొలి రోజే కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే కెరీర్‌లో 15వ సెంచరీ నమోదు చేసి, జయసూర్య, మాథ్యూస్‌ల రికార్డును అధిగమించాడు.

శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్‌ (16), మర్వన్‌ ఆటపట్టు (16), కరుణరత్నే (15) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత జయసూర్య, మాథ్యూస్‌లతో కలిసి చండీమాల్‌ ఏడో ప్లేస్‌లో ఉన్నాడు.

4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌.. 
రెండో రోజు లంచ్‌ తర్వాత లంక ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్నోయింది. అనంతరం అదే ఓవర్‌లో రెండో వికెట్‌ కూడా కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌ ముర్రే కొమిన్స్‌ (0), కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ (4) ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 35/2గా ఉంది. 
 

మరిన్ని వార్తలు