సిరీస్‌ ఫలితాన్నే మార్చేసిన స్టన్నింగ్‌ క్యాచ్‌

20 Aug, 2020 18:14 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకు పైగా భారత్‌ క్రికెట్‌ జట్టును ఏలిన ఘనత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ది. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరిన ఏకైక బ్యాట్స్‌మన్‌ సచిన్‌. 1989లో అరంగేట్రం చేసిన సచిన్‌ టెండూల్కర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి సెంచరీ చేయడానికి 8 టెస్టుల వరకు ఆగాల్సి వచ్చింది.  1990లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 17 ఏళ్ల వయసులో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అలా ఆరంభమైన సచిన్‌ సెంచరీల ప్రస్థానం శతక శతకాలను చూస్తే వరకూ ఆగలేదు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలతో ప్రత్యేకంగా తనొక శకాన్నే సృష్టించుకున్నాడు సచిన్‌. ఇలా ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచిన సచిన్‌.. బౌలింగ్‌లో కూడా అద్భుతాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. (ధోని కంటతడి పెట్టాడు!)

తన లెగ్‌ బ్రేక్‌లతో మ్యాజిక్‌ చేసి భారత్‌కు విజయాల్ని అందించిన క్షణాలు కూడా క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమే. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఫీల్డింగ్‌లో కొన్ని మధురమైన క్షణాలను కూడా సచిన్‌ సొంతం చేసుకున్నాడు. తాజాగా సచిన్‌కు సంబంధించిన ఒక ఫీల్డింగ్‌ వీడియో వైరల్‌ అవుతుంది. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం సచిన్‌ పట్టిన ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌ను మరొకసారి గుర్తుచేసుకున్నారు ఫ్యాన్స్‌.

2004 పాకిస్తాన్‌ పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్‌లో సచిన్‌ లాంగాన్‌ బౌండరీ వద్ద క్యాచ్‌ను అందుకున్న తీరు ఆ మ్యాచ్‌కే హైలైట్‌ అనడం కంటే ఇప్పటికీ హైలైట్‌ అంటేనే బాగుంటుందేమో. అది సిరీస్‌ ఫలితాన్నే మార్చేసిన క్యాచ్‌. పాక్‌ క్రికెటర్‌ ఇంజమాముల్‌ హక్‌ క్యాచ్‌ను ఒంటిచేత్తో సచిన్‌ అందుకోవడంతో అప్పటివరకూ గెలిచే స్థితిలో ఉన్న పాకిస్తాన్‌ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయంతో సిరీస్‌ 2-2తో సమం కాగా, ఇక చివరి వన్డేను భారత్‌ గెలిచి సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.  సిరీస్‌ ఫలితాన్ని మార్చిన ఆనాటి క్యాచ్‌ ఇప్పుడు వైరల్‌గా మారడంతో ఆ మ్యాచ్‌ను చూడని క్రికెట్‌ అభిమానులు.. సచిన్‌లోని అద్భుతమైన ఫీల్డర్‌ను చూసి మురిసిపోతున్నారు.

మరిన్ని వార్తలు