WTC Final 2023: ఏ లెక్కన ఆసీస్‌ను ఓడించదో చెప్పండి?

14 Mar, 2023 20:20 IST|Sakshi

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసినప్పటికి తొలి రెండు టెస్టుల్లో టీమిండియానే విజయం వరించింది. ఇక మూడో టెస్టులో ఆసీస్‌ విజయాన్ని అందుకుంది.

అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే నాలుగో టెస్టులో టీమిండియా గెలవాల్సిన అవసరం ఉన్నప్పటికి.. న్యూజిలాండ్‌ చేతిలో లంక పరాజయం పాలవ్వడంతో మనకు లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో వరుసగా రెండోసారి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనుంది. జూన్‌ 9న ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది.

కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచేది టీమిండియానే అని భారత మాజీ ఆటగాడు సౌరవ్‌ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఏ లెక్కన టీమిండియా ఆసీస్‌ను ఓడించదో చెప్పండంటూ పేర్కొన్నాడు. రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో గంగూలీ మాట్లాడుతూ.. ''మొదట ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్‌. అయితే ఇంగ్లండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియాను ఎందుకు ఓడించదో ఒక్క కారణం చెప్పండి. ఎందుకంటే 2020-21లో ఆసీస్‌ను వారిగడ్డపైనే ఓడించింది.. మరోసారి స్వదేశంలో వారిని మట్టికరిపించింది. ఇంగ్లండ్‌ గడ్డపై జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియాకు బ్యాటింగ్‌ కీలకం కానుంది. తొలి ఇన్నింగ్స్‌లో 350 నుంచి 400 పరుగులు చేస్తే కచ్చితంగా టీమిండియాదే గెలుపు.

ఇక శుబ్‌మన్‌ గిల్‌ లాంటి ప్లేయర్‌ టెస్టులకు దొరకడం టీమిండియా అదృష్టం. చంఢీఘర్‌లో పుట్టి పెరిగిన గిల్‌ తొలి టెస్టు సెంచరీని అందుకున్నాడు. 235 బంతుల్లో 128 పరుగులు చేసిన గిల్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. గత ఆరు, ఏడు నెలలుగా గిల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌ తన ప్రదర్శనతో టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: 'ఐపీఎల్‌ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపిస్తాం'

మరిన్ని వార్తలు