ఇక చాలు అనుకోలేదు

5 Aug, 2021 06:34 IST|Sakshi

అదే మరో పతకంవైపు నడిపించింది

వరల్డ్‌ నంబర్‌వన్‌ కూడా అవుతా

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సింధు   

అలుపన్నది ఉందా ఎగిరే అలకు... విరామమన్నది లేదా సింధు సాధనకు... టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పీవీ సింధు పడిన కష్టం మాటలకు అందనిది. కోర్టులో తన ఆటను మెరుగుపర్చుకోవడం ఒక ఎత్తు కాగా, అత్యుత్తమ ఫిట్‌నెస్‌ నుంచి సాధించేందుకు బ్రేక్‌ అనేదే లేకుండా సుదీర్ఘ సమయం పాటు కొన్ని నెలలపాటు చేసిన ట్రైనింగ్‌ ఆమెకు మరో పతక విజయంలో కీలకపాత్ర పోషించింది. బ్యాడ్మింటన్‌పై ఉన్న మక్కువే గత ఐదేళ్లలో తనను నడిపించిందని సింధు ‘సాక్షి’తో వెల్లడించింది.   

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం... నలుపు రంగు జంప్‌ సూట్‌లో బయటకు వస్తున్న బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధును చూసి ఆ ప్రాంతమంతా హోరెత్తింది. పూలతో అభినందన, శాలువాలతో సత్కారం...పొలిటీషియన్ల నుంచి పోలీస్‌ ఉన్నతాధికారి వరకు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. మాస్క్‌ వెనక దాగిన ఆమె చిరునవ్వులో రెండో ఒలింపిక్‌ పతకం సాధించిన విజయగర్వం కనిపించింది. అనంతరం ఇంటికి చేరిన సింధు, తన కెరీర్‌లోని ప్రత్యేక సందర్భం విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకుంది. ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే...

‘రియో’ రజతంతో పోలిస్తే...
సహజంగానే రజత పతకం తర్వాత స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే సన్నద్ధమయ్యాను.  సెమీఫైనల్లో కూడా నా శక్తిమేర ప్రయత్నించినా విజయం సాధించలేదు. అదే కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌ చూస్తే ఎంత పదునైన ఆటతీరు కనబర్చానో కనిపిస్తుంది. రజతంతో పోలిస్తే ఒక మెట్టు దిగినట్లు కనిపిస్తున్నా... ఒలింపిక్‌ పతకానికి ఉండే విలువ ఎప్పుడైనా ప్రత్యేకమే.

కరోనా పరిస్థితులను అధిగమించి...
ఒకదశలో ఒలింపిక్స్‌ జరగవేమో అనిపించింది. నిజానికి ఏ ప్లేయర్‌కైనా తాను తర్వాత ఎప్పుడు, ఎక్కడ ఆడబోతున్నాడో తెలిస్తేనే ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. కానీ ఈ ఒలింపిక్స్‌ విషయంలో అలా జరగలేదు. గత ఏడాది పరిస్థితి కొంతమారి లాక్‌డౌన్‌ పాక్షికంగా తొలగించిన తర్వాతా టోర్నీల విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ప్రాక్టీస్‌ చేసినా ఏం లాభం అనే పరిస్థితి కనిపించింది. ఇలాంటప్పుడు కూడా నేను సాధన కొనసాగించాను. నిజానికి ఆ సమయాన్ని నేను ఇంకా బాగా వాడుకున్నట్లే లెక్క.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో సింధుకు స్వాగతం పలికిన తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి

అందరి సహకారంతోనే...
ఒక ఒలింపిక్‌ మెడల్‌ విజయం వెనక ఆట మాత్రమే కాదు, అదనంగా అనేక అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. ప్లేయర్‌గా నేను కష్టపడటంతోపాటు అండగా నిలిచే ఒక ‘ఎకో సిస్టం’ అవసరం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొదటి నుంచి తోడుగా ఉన్నారు. కెరీర్‌లో నేను ఎదుగుతున్న కీలక సమయంలో 2014లో సహకరించేందుకు ముందుకు వచ్చిన బేస్‌లైన్‌ కంపెనీ ఇప్పటికీ నాతో కలిసి పని చేస్తోంది. కోచ్‌ పార్క్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రైనర్, ఫిజియోల వల్లే గాయాల నుంచి తప్పించుకుంటూ ఒలింపిక్స్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లగలిగాను.

ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌తో...
కష్టం, పోరాటం లేనిది విజయం రాదని నమ్మే వ్యక్తిని నేను. అత్యుత్తమ అథ్లెట్లతో పోటీ పడే విధంగా నా ఫిట్‌నెస్‌ కోసం తీవ్రంగా శ్రమించాను. ట్రైనర్‌ శ్రీకాంత్‌ నాకు శిక్షణ ఇచ్చారు. ఆయన నన్ను ఎంత కష్టపెట్టినా భరించాను. కష్టసాధ్యమైన ఎక్సర్‌సైజ్‌లు, వెయిట్‌ ఎక్సర్‌సైజ్‌లు చాలా చేశాను.  గంటలకొద్దీ ట్రైనింగ్‌ తర్వాత కూడా ఏ రోజూ ఇక చాలు అని ఆగిపోలేదు! మళ్లీ దేనికైనా సిద్ధం అన్నట్లుగా మానసికంగా దృఢంగా ఉన్నాను. గతంలో సుదీర్ఘ ర్యాలీల సమయంలో అలసిపోయి మ్యాచ్‌లు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దానిపైనా దృష్టి పెట్టాం. ఒలింపిక్స్‌ మ్యాచ్‌లలో  ముఖ్యంగా టోక్యో బయల్దేరడానికి రెండు నెలల ముందు నుంచైతే ఇంకా కఠోర సాధన చేసాను. ప్రతీ రోజు, ప్రతీ సెషన్‌ను కీలకంగానే భావించా తప్ప విరామం తీసుకోలేదు.  

మళ్లీ మళ్లీ గెలవాలనే తపనే...
ఒకసారి ఒలింపిక్‌ పతకం గెలుచుకున్నాక ఇక కెరీర్‌లో అన్ని సాధించేసిన భావన చాలా మందిలో వచ్చేస్తుంది. రియోలో రజతం తర్వాత సహజంగానే కొంత కాలం ఆ విజయాన్నే ఆస్వాదించాను. అయితే ఇక చాలు అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. అదే మరో ఒలింపిక్‌ పతకం వరకు తీసుకెళ్లింది. నాకు బ్యాడ్మింటన్‌ అంటే పిచ్చి ప్రేమ. మనకు నచ్చిన పని చేయడంలో ఎవరికీ కష్టం అనిపించదు. అలాంటప్పుడు ప్రేరణ సహజంగానే లభిస్తుంది.

మధ్యలో కొన్నిసార్లు మన మనసు చెదిరి ఇతర అంశాలపై దృష్టి వెళ్లడం కూడా సహజం. అయితే వెంటనే మన లక్ష్యం ఏమిటో తెలిస్తే వెంటనే మళ్లీ దారిలో పడతాం. ఒలింపిక్స్‌ పతకమే కాదు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా నేను ఆగిపోలేదు. మున్ముందూ అంతే పట్టుదలగా ఆడతాను. కెరీర్‌లో ఇంకా వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించలేదు. బాగా ఆడి అది కూడా అందుకోగలను. ఇప్పుడే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ గురించి ఆలోచించడం లేదు. కొంతకాలం ఈ విజయాన్ని ఆస్వాదించి మళ్లీ ప్రాక్టీస్‌లోకి దిగుతా.
 
అంతకుముందు ఉదయం ‘సాక్షి’ న్యూఢిల్లీ
ప్రతినిధితో మాట్లాడుతూ సింధు... ‘2016లో మొదటిసారి మెడల్‌ వచ్చినప్పుడు నాపై అంత అంచనాలు ఏవీ లేవు. కానీ ఈసారి ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ఒత్తిడి, అంచనాలు, బాధ్యతలు చాలానే ఉన్నాయి. సెమీఫైనల్స్‌లో ఓడిపోయినప్పుడు కొంచెం బాధేసింది. కానీ మా కోచ్, మా ఫిజియో నాకు చాలా సపోర్ట్‌ చేశారు. పేరెంట్స్‌ కూడా ఫోన్‌ చేసి నీకు ఇంకో ఛాన్స్‌ ఉంది అని నన్ను ప్రోత్సహించారు. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురవుతాం. ఆ ఆలోచనలను పక్కనబెట్టి కాంస్య పతకంపై దృష్టి పెట్టాలని మా కోచ్‌ నాకు సూచించారు.

కాంస్య పతకం రావడం, నాలుగో స్థానంలో ఉండడానికి చాలా తేడా ఉంటుందని కోచ్‌ చెప్పారు. కష్టపడితే నువ్వు తప్పకుండా కాంస్యం సాధిస్తావని ఆయన నన్ను ప్రోత్సహించారు. అందువల్లే నేను మెడల్‌ సాధించగలిగాను. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా ప్రయాణం  ప్రారంభించినప్పుడు  స్వల్పకాలిక లక్ష్యాలు ఉండేవి. ఆ తర్వాత నేను నా ఆటను చాలా మెరుగు పర్చుకున్నాను. వచ్చే రెండు వారాల్లో ప్రధాని సమయం కేటాయించినప్పుడు వెళ్ళి ఆయనను కలుస్తాము. ప్రధాని చెప్పినట్లుగానే ఆయనతో కలిసి ఐస్‌క్రీం తింటాను. ఆయనను కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను’ అని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు