Tokyo Olympics: చాను సిల్వర్‌ మెడల్‌ గోల్డ్ అయ్యేనా..? ఛాన్స్‌ ఉందంటున్నారు..! 

26 Jul, 2021 15:38 IST|Sakshi

టోక్యో: ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడ‌ల్ ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో చాను సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హు జిహుయి బంగారు పతకం గెలిచింది. అయితే, కొన్ని కారణాల వల్ల జిహుయిని ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా నిర్వహకులు ఆదేశించారు. ఆమెకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు యాంటీ డోపింగ్ అధికారులు వెల్లడించారు. ఒక‌వేళ జిహుయి డోప్ పరీక్షలో విఫ‌ల‌మైతే.. రెండో స్థానంలో ఉన్న మీరాబాయి చానుకి గోల్డ్ మెడ‌ల్ ద‌క్కుతుంది.

కాగా, ఈ ఈవెంట్‌లో జిహుయి.. స్నాచ్‌లో 94 కిలోలు , క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 116 కిలోలు(మొత్తంగా 210 కిలోలు) ఎత్తి బంగారు పతకం కైవసం చేసుకోగా, చాను.. స్నాచ్‌లో 87 కిలోలు , క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోల(మొత్తంగా 202 కిలోలు) బరువు ఎత్తి రజతంతో సరిపెట్టుకుంది. ఇక ఇండోనేషియా వెయిట్‌లిఫ్ట‌ర్ విండీ కాంటికా మొత్తంగా 194 కిలోల బరువు ఎత్తి కాంస్యం తృప్తి చెందింది. ఇదిలా ఉంటే, మీరాబాయి ఇప్ప‌టికే భారత్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైంది. సోమవారం ఉద‌యం స్వదేశానికి ఫ్లైటెక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కోచ్‌తో దిగిన ఫొటోను ఆమె ట్విట‌ర్‌లో షేర్ చేసింది.

>
మరిన్ని వార్తలు