టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌: ఆరంభం, ముగింపు ఒకేలా!

28 Mar, 2021 19:17 IST|Sakshi

పుణే: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో కోహ్లి ఏడు పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. మొయిన్‌ అలీ వేసిన ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ నాల్గో బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లిని అత్యధికసార్లు ఔట్‌ చేసిన జాబితాలో మొయిన్‌ అలీ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక గ్రేమ్‌ స్వాన్‌, జేమ్స్‌ అండర్సన్‌, బెన్‌ స్టోక్స్‌లు కోహ్లిని ఎనిమిదిసార్లు ఔట్‌ చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్‌ చేసింది టిమ్‌ సౌతీ. న్యూజిలాండ్‌కు చెంది ఈ రైట్‌ ఆర్మ్‌ మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ 10సార్లు ఔట్‌ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

అరుదైన సందర్భం.. ఆరంభం, ముగింపు ఒకేలా!

టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో కోహ్లి వికెట్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మొయిన్‌ అలీనే దక్కించుకున్నాడు. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లిని బౌల్డ్‌ చేసిన మొయిన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఎల్బీగా ఔట్‌ చేశాడు. తొలి టెస్టులో చోటు దక్కని మొయిన్‌.. రెండో టెస్టు తుది జట్టులో చోటు సంపాదించి ఎనిమిది వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో​ నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను మొయిన్‌ తీశాడు. 

కాగా, తాజా మ్యాచ్‌ ఇంగ్లండ్‌కు ఈ పర్యటనలో చివరిది.  ఇక్కడ మొయిన్‌ అలీ ఖాతాలోనే కోహ్లి వికెట్‌ చేరింది. అది కూడా బౌల్డ్‌ రూపంలో కోహ్లి వికెట్‌ వచ్చింది మొయిన్‌ అలీకి. ఇలా మొయిన్‌ అలీ ఆడిన తొలి మ్యాచ్‌లోనూ, చివరి మ్యాచ్‌లోనూ కోహ్లి వికెట్‌ను తీయడం ఒకటైతే, బౌల్డ్‌ రూపంలో రావడం మరొకటి. ఇది అరుదైన సందర్భమనే చెప్పాలి. ఇంగ్లండ్‌తో చివరి మ్యాచ్‌లో కోహ్లి బౌల్డ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా,  2019 ఆగస్టు నుంచి విరాట్‌ వన్డే యావరేజ్‌ తగ్గడానికి కూడా స్పిన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడమేనని ట్రోల్‌ చేస్తున్నారు అభిమానులు. ఇక్కడ చదవండి: ఆ సిక్స్‌ దెబ్బకు.. బ్యాట్‌నే చెక్‌ చేశాడు!

>
మరిన్ని వార్తలు