Narayan Jagadeesan: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు

21 Nov, 2022 17:47 IST|Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ-2022 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా  తమిళనాడు-అరుణాచల్‌ప్రదేశ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 21) జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌ కనీవినీ ఎరుగని రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో నారాయణ్‌ జగదీశన్‌ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో శివాలెత్తడంతో తమిళనాడు 435 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లిస్ట్‌-ఏ (అంతర్జాతీయ వన్డేలతో పాటు దేశవాలీ వన్డేలు) క్రికెట్‌లో ఇదే అత్యంత భారీ విజయంగా రికార్డుపుటల్లోకెక్కింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు.. ఓపెనర్లు జగదీశన్‌, సాయ్‌ సుదర్శన్‌ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకాలతో వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది.

అనంతరం ఆసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అరుణాచల్‌ప్రదేశ్‌.. 28.4 ఓవర్లలో కేవలం 71 పరుగులకే ఆలౌటై, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మణిమారన్‌ సిద్ధార్థ్‌ (5/12) అరుణాచల్‌ప్రదేశ్‌ పతనాన్ని శాశించాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన జగదీశన్‌ వ్యక్తిగతంతా పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇదే టోర్నీలో 4 వరుస శతకాలు బాదిన (114 నాటౌట్‌, 107, 168, 128) జగదీశన్‌.. తాజాగా డబుల్‌ సెంచరీతో వరుసగా ఐదో శతకాన్ని నమోదు చేశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఇలా వరుసగా ఐదు సెంచరీలు చేయడం ప్రపంచ రికార్డు. గతంలో శ్రీలంక దిగ్గజం సంగక్కర, సౌతాఫ్రికా ఆటగాడు అల్విరో పీటర్సన్‌, భారత క్రికెటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ వరుసగా 4 శతాకలు బాదారు. 

ఈ మ్యాచ్‌లో డబుల్‌ సాధించే క్రమంలో జగదీశన్‌ ఏకంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డునే బద్దలు కొట్టాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రోహిత్‌ (శ్రీలంకపై 264 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. జగదీశన్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ విభాగంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు ఇంగ్లీష్‌ క్రికెటర్‌ అలిస్టర్‌ బ్రౌన్‌ (268) పేరిట ఉండేది. 

డబుల్‌ సాధించే క్రమంలో జగదీశన్‌ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి శతకాన్ని సాధించేందుకు 76 బంతులు తీసుకున్న అతను.. రెండో సెంచరీని కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. డబుల్‌ సెంచరీలో రెండో అర్ధభాగాన్ని ఇన్ని తక్కువ బంతుల్లో పూర్తి చేయడం ​కూడా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రికార్డే. మొత్తానికి నారాయణ్‌ జగదీశన్‌ ధాటికి లిస్ట్‌-ఏ రికార్డులు చాలావరకు బద్ధలయ్యాయి. అతను సృష్టించిన విధ్వంసం ధాటికి పలు ప్రపంచ రికార్డులు సైతం తునాతునకలయ్యాయి. అతని సిక్సర్ల సునామీలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కొట్టుకుపోయింది. 


 

మరిన్ని వార్తలు