CWG 2022: కామన్‌వెల్త్‌లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్‌

2 Aug, 2022 12:04 IST|Sakshi

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో పాల్గొన్న భారత్‌ మహిళా సైక్లిస్ట్‌ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. విషయంలోకి వెళితే.. గేమ్స్‌లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో  భారత్‌ నుంచి మహిళా సైక్లిస్ట్‌ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే ఈ మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్‌ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్‌ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది.


దీంతో బ్రయోనీ బోథా కూడా సైకిల్‌పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైడర్‌లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఇదే లీ వ్యాలీవెలో పార్క్ వద్ద ఇది రెండో ప్రమాదం. ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్‌లో సైకిల్‌పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు. 

చదవండి: CWG 2022: కామన్‌వెల్త్‌లో భారత్‌ ​జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం

మరిన్ని వార్తలు