పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ

3 Mar, 2023 21:48 IST|Sakshi

బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ల మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ చివర్లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ తీసుకున్న నిర్ణయం క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురి చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌ తస్కిన్‌ అహ్మద్‌ వేశాడు. ఆ ఓవర్‌లో తస్కిన్‌ వేసిన యార్కర్‌ బంతిని ఆదిల్‌ రషీద్‌ సమర్థంగా అడ్డుకున్నాడు.

బంతి రషీద్‌ ప్యాడ్‌కు దూరంగా బ్యాట్‌ అంచున తాకింది. అయితే బంగ్లా బౌలర్‌ తస్కిన్‌ అహ్మద్‌ ఎల్బీకి అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ ఔటివ్వలేదు. దీంతో కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ వెంటనే డీఆర్‌ఎస్‌ కోరాడు. రిప్లేలో బంతి ఎక్కడా ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించలేదు కదా బంతి ప్యాడ్లకు చాలా దూరంగా ఉన్నట్లు చూపించింది. దీంతో అంపైర్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు.

వాస్తవానికి బంతి ప్యాడ్లను తాకలేదని క్లియర్‌గా కనిపిస్తుంది. మ్యాచ్‌ చూసే చిన్న పిల్లాడిని అడిగినా నాటౌట్‌ అని చెప్పేస్తాడు. బంతి ఎక్కడ పడిందన్న కనీస పరిజ్ఞానం లేకుండా తమీమ్‌ ఇక్బాల్‌ డీఆర్‌ఎస్‌ కోరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. ఒక రకంగా ఔట్‌ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రివ్యూకు వెళ్లి బంగ్లా పరువు తీసుకుంది. ఇంకేముంది సోషల్‌ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌ అయింది. బంగ్లా క్రికెట్‌ జట్టుపై అభిమానులు ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు.

''క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూకు కాల్‌ ఇచ్చిన బంగ్లా జట్టుకు ఏ ప్రైజ్‌ ఇవ్వాలో కాస్త చెప్పండి''.. ''ఏ కోశానా అది ఔట్‌  చె‍ప్పండి.. బంగ్లా కెప్టెన్‌కు కళ్లు మూసుకుపోయినట్లున్నాయి''.. ''క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది'' అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఇంగ్లండ్‌ 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జేసన్‌ రాయ్‌ (132 పరుగులు) సెంచరీతో కదం తొక్కడంతో పాటు బట్లర్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌ మెరవడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 194 పరుగులకే కుప్పకూలింది.

షకీబ్‌ అల్‌ హసన్‌ 58 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్‌ ఇక్బాల్‌ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కరన్, ఆదిల్‌ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు.  ఈ విజయంతో ఇంగ్లండ్‌ మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్‌ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్‌ వేదికగా జరగనుంది. 

చదవండి: జేసన్‌ రాయ్‌ విధ్వంసం; సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌ 

ఇండోర్‌ పిచ్‌ అత్యంత నాసిరకం' 

మరిన్ని వార్తలు