Kanika Ahuja: విరాట్‌ సర్‌ చెప్పింది ఇదే! అమ్మ నన్ను బయటకు వెళ్లగొట్టేది..

16 Mar, 2023 16:35 IST|Sakshi

Women's Premier League 2023- RCB: ‘‘ఆట ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అంతేకానీ ఒత్తిడిని కాదని విరాట్‌ సర్‌ చెప్పారు. ఒత్తిడిలో కూరుకుపోకూడదని.. ఎంతగా వీలైతే అంతలా ఆటను ఆస్వాదించాలని.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు’’ అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళా క్రికెటర్‌ కనిక అహుజా పేర్కొంది. విరాట్‌ కోహ్లి తమలో స్ఫూర్తి నింపాడని, ఆయన మాటల ప్రభావం తన మీద పనిచేసిందని చెప్పుకొచ్చింది.

కాగా మహిళా ప్రీమియర్‌ లీగ్‌-2023 ఆరంభ సీజన్‌లో ఆర్సీబీ జట్టుకు వరుసగా పరాజయాలు ఎదురైన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్‌ స్మృతి మంధానపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కనిక అద్బుతం చేసింది. ముంబైలోని డీవై పాటిల్‌ మైదానంలో యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తానున్నానంటూ అభయమిచ్చింది.

కనిక కీలక ఇన్నింగ్స్‌
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 20 ఏళ్ల కనిక 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 46 పరుగులు చేసింది. కనికకు తోడు రిచా ఘోష్‌ 31 పరుగులతో రాణించడంతో యూపీ విధించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కనికకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 

ఇదిలా ఉంటే..ఆస్ట్రేలియా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌ పూర్తి చేసుకున్న కోహ్లి ఆర్సీబీ మహిళా జట్టును కలిశాడు. యూపీతో మ్యాచ్‌కు ముందు తన ప్రసంగంతో జట్టులో స్ఫూర్తి నింపాడు. ఈ నేపథ్యంలో కనిక మాట్లాడుతూ కోహ్లిపై అభిమానాన్ని చాటుకుంది. 

అమ్మ ఆడుకొమ్మని వెళ్లగొట్టేది
ఇక తన నేపథ్యం గురించి చెబుతూ.. ‘‘నేను ఇంట్లో ఉంటే రూఫ్‌ మీదకెక్కి పతంగులు ఎగురవేస్తాను. అల్లరి చేస్తాను. అందుకే మా అమ్మ బయటికి వెళ్లి ఆడుకోమంటూ నన్ను వెళ్లగొట్టేది(నవ్వుతూ). నిజానికి మా ఇంట్లోవాళ్లకు ఆడపిల్లలకు కూడా క్రికెట్‌ టోర్నీలు ఉంటాయని తెలియదు.

మా నాన్న ఎప్పుడూ చదువు మీదే దృష్టి పెట్టమంటారు. కానీ మా అమ్మ మాత్రం క్రికెట్‌ ఆడమని ప్రోత్సహించేది. ఇప్పుడు కూడా తను ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చింది’’ అని కనిక అహుజా పేర్కొంది. కాగా పంజాబ్‌లోని పాటియాలలో ఆగష్టు 7, 2002లో కనిక జన్మించింది. ఈ ఆల్‌రౌండర్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌.

చదవండి: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టగలిగేది అతడే.. 110 సెంచరీలతో: పాక్‌ మాజీ పేసర్‌
Asif Khan: చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్‌.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు
IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. సచిన్‌ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లి

మరిన్ని వార్తలు