మరో 11 మంది వీఏఏలపై చర్యలు?

21 Mar, 2023 00:08 IST|Sakshi

కావలి: నియోజకవర్గంలో కొందరు గ్రామ వ్యవసాయ సహాయకులు గాడి తప్పారు. ఈ–క్రాప్‌లో పంటల నమోదు నుంచి ఎరువుల విక్రయాల వరకూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. పంటల నమోదులో అక్రమాలకు పాల్పడినందుకు గతేడాది 17 మందిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ–క్రాప్‌లో అక్రమాలకు పాల్పడిన మరో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు పడింది. మరో 11 మందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆర్బీకేల పరిధిలో మార్కెఫెడ్‌ ద్వారా రైతులకు ఎరువులు విక్రయించి నగదు జమచేయకపోవడమే కారణమని చెబుతున్నారు. 11 మంది రూ.23 లక్షల మేర చెల్లించాల్సినట్లుగా లెక్కలు తేల్చారు. ఆ నగదు కట్టకుంటే చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు