ముందు తమ్ముడు, తర్వాతే అన్న.. టీడీపీలో చేరనున్న కోటంరెడ్డి!

21 Mar, 2023 00:08 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కోటంరెడ్డి బ్రదర్స్‌ని తీసుకోవద్దని అధిష్టానానికి స్థానిక నాయకులు ఎంత మొర పెట్టుకున్నా వినలేదు. గిరిధర్‌రెడ్డి టీడీపీ కండువా కప్పుకొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో తొలి నుంచి పార్టీలో ఉన్న నాయకులు ఆలోచనలో పడిపోయారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అంపశయ్యపై ఉన్న ఆ పార్టీని బతికించేందుకు చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాత నేతలకు మొండిచేయి చూపించేందుకు వెనకాడరని ప్రచారం ఉంది. గెలుపే లక్ష్యంగా బడాబాబులను రంగంలోకి దించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కోటంరెడ్డికి గాలం వేసింది. ఇందుకోసం కోటంరెడ్డి బ్రదర్స్‌ రాకను వ్యతిరేకిస్తున్న అబ్దుల్‌ అజీజ్‌తోపాటు పలువురు రూరల్‌ నియోజవర్గ నాయకులకు చెక్‌ పెట్టి పక్కన పెడుతున్నట్లు సమాచారం.

ఇద్దరూ కలిసి..
అబ్దుల్‌ అజీజ్‌ తనను మేయర్‌ను చేసి రాజకీయంగా భవిష్యత్‌ కల్పించిన తల్లిలాంటి వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని దారుణంగా తిట్టి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన అజీజ్‌ మొదటి నుంచి రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందంతో ముందుకు వెళ్తున్నారు. నాలుగేళ్ల కాలంలో ప్రెస్‌మీట్లు పెట్టి కోటంరెడ్డిపై ఏదో ఒకటి మాట్లాడేవారు. అయితే ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి అజీజ్‌ను ఒక్కమాట కూడా అనలేదు. దీనిని బట్టే వారి మధ్య స్నేహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే శ్రీధర్‌రెడ్డి రాజకీయ వ్యూహంలోనే అజీజ్‌ను రాజకీయ పావుగా వాడుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీతో సన్నిహితంగా ఉంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రూరల్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆయన అజీజ్‌కు వెన్నుపోటు పొడిచాడని కొందరు తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే అంటున్నారు. అజీజ్‌ తేరుకొనే సరికి ఆయన రాజకీయ భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్లిపోయింది.

అధిష్టానమే కారణం?
కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామా చేసి వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఆయన ఎన్నో అరాచకాలు చేశాడని ఆరోపణలున్నాయి. కొందరికి జీతాలిచ్చి దారుణాలు చేయించాడని, తమ నేతలను టార్గెట్‌ చేసి దాడులకు పాల్పడ్డాడని టీడీపీ చాలాకాలం విమర్శించింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎమ్మెల్యే కొట్టించాడని తెలుగు తమ్ముళ్లు అనేక సందర్భాల్లో వాపోయారు. ఇంకా ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, దందాలతో శ్రీధర్‌రెడ్డి రూ.కోట్లు అక్రమంగా సంపాదించాడని ప్రచారం ఉంది. సింహపురి రాజకీయ చరిత్రలోనే ఇంత అరాచకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేను చూడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కోటంరెడ్డి అరాచకాలు చేస్తున్నాడని నిన్న మొన్నటి వరకు నోరు చించుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు నోటికి తాళం వేసుకున్నారు. కోటంరెడ్డి బ్రదర్స్‌ వస్తే సహించమని అధినేత చంద్రబాబుకు హుకుం జారీ చేసిన వారు ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. దీనికి కారణం అధిష్టానమేనని చెబుతున్నారు. నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా టీడీపీని ఖతం చేసిన వ్యక్తికే రాచబాట వేసి పార్టీలోకి ఆహ్వానించడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణియించుకోలేకపోతున్నారు. అయితే వారికి నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి ఉంది.

బూతులు మాట్లాడిన నోటితోనే..
అధికారంతో విర్రవీగి అన్నివర్గాల వారిపై బూతులతో చెలరేగిపోయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నానని సుద్దులు చెప్పడంపై రూరల్‌ నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. ఎమ్మెల్యే బూతుపురాణాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత ఆడియో రికార్డింగ్‌లను ప్రస్తుతం వైరలవు తున్నాయి. నేడు ఆత్మీయ సమావేశాలు పెట్టి నియోజకవర్గ అభివృద్ధి అంటూ సుద్దులు చెబుతుంటే స్థానిక ప్రజలే ఎమ్మెల్యేను అసహ్యించుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని, ఇదంతా తన క్రెడిట్‌ అని శ్రీధర్‌రెడ్డి గొప్పలు చెప్పారు. నేడు మాత్రం అభివృద్ధి జరగలేదని చెబుతూ నవ్వులపాలవుతున్నారు.

మరిన్ని వార్తలు