రూ.36.73 కోట్లు జమ

25 May, 2023 01:06 IST|Sakshi
44,301 మంది తల్లుల ఖాతాల్లో

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 44,301 మంది తల్లుల ఖాతాల్లో రూ.36.73 కోట్లు జమ అయ్యాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ వెల్లడించారు. 2022– 23 ఏడాదికి సంబంధించి రెండో విడత జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరెట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని నమూనా చెక్కును విద్యార్థులకు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజులను త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ పలు అభివృద్ధి పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. విద్యార్థులు ద్రాక్షాయని, ఉదయ్‌, కల్యాణి, స్రవంతి, పవిత్రా మాట్లాడుతూ చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక స్థోమత లేకపోయిన వారికి విద్యాదీవెన వంటి పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఉమెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బల్లాడ హేమమాలిని రెడ్డి, కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, రాజాపు హైమావతి, సాంఘిక సంక్షేమ శాఖ (ఎఫ్‌.ఏ.సి) అధికారి గడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో జగనన్న విద్యాదీవెన కింద 49,165 మంది విద్యార్థులకు లబ్ధి

చెక్కు పంపిణీలో కలెక్టర్‌

శ్రీకేష్‌ బి.లాఠకర్‌ వెల్లడి

మరిన్ని వార్తలు