వామ్మో! క్రెడిట్‌ కార్డు రుణాలు.. ఒక్క ఏప్రిల్‌లోనే అన్ని లక్షల కోట్లా!

27 Jun, 2023 09:15 IST|Sakshi

ఏడాదిలో 30 శాతం పెరిగిన రుణాలు

వ్యక్తిగత రుణాల్లో మూడో స్థానంలో క్రెడిట్‌ కార్డు రుణాలు

దేశంలో క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఏడాదిలో క్రెడిట్‌కార్డ్‌ రుణాలు ఏకంగా 30 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. క్రెడిట్‌ కార్డు రుణ బకాయిలు అమాంతంగా పెరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 

► దేశంలో క్రెడిట్‌ కార్డ్‌ రుణ బకాయిలు 2023 ఏప్రిల్‌లో ఏకంగా రూ.2.05 లక్షల కోట్లకు చేరాయి. 2022, ఏప్రిల్లో ఉన్న బకా­యిల కంటే ఇవి 30 శాతం అధి­కం  కావడం గమనార్హం. 2023, ఏప్రిల్‌లోనే రూ.1.3 లక్షల కోట్ల మేరకు క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు తీసు­కోవడం విస్మయపరుస్తోంది.

►  ఇక బ్యాంకులు ఇస్తున్న మొత్తం రుణాల్లో క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు 1.4 శాతానికి చేరాయి. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో దేశంలో క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు అత్యధికంగా 1.2 శాతానికి చేరాయి. అనంతరం దశాబ్దం పాటు క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు ఒక్క శాతం కంటే తక్కువే ఉంటూ వచ్చాయి. కానీ 2023 ఏప్రిల్‌లో క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు 1.4 శాతానికి చేరుకోవడం గమనార్హం. కాగా విశ్వసనీయమైన ఖాతాదారులకే క్రెడిట్‌ కార్డ్‌ రుణాలిస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. దేశ జనాభాలో ఇంకా కేవలం 5 శాతం మందే క్రెడిట్‌ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆర్‌బీఐ తెలిపింది. 

►  దేశంలో వ్యక్తిగత రుణాల్లో క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. వ్యక్తిగత రుణాల్లో గృహ రుణాలు మొదటి స్థానంలో ఉన్నాయి. బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో గృహ రుణాల వాటా 14.1 వాటా ఉంది. 3.7శాతం వాటాతో వాహన రుణాలు రెండో స్థానంలో ఉన్నాయి. 1.4 శాతంతో క్రెడిట్‌ కార్డు రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. 
►  బ్యాంకులు జారీ చేస్తున్న పారిశ్రామిక రుణాల వాటా 2022–23లో తగ్గింది. 2021–22లో పారిశ్రామిక రుణాలు 26.3శాతం ఉండగా.. 2022–23లో 24.3 శాతానికి తగ్గాయి.

చదవండి: గుడ్‌న్యూస్‌: ఈపీఎఫ్‌వో అధిక పింఛన్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు

మరిన్ని వార్తలు