Family Travel: 90 శాతం పెరిగిన ఫ్యామిలీ టూర్‌లు.. టాప్‌ 4లో హైదరాబాద్‌!

7 Apr, 2023 14:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సకుటుంబ సపరివార సమేతంగా చేసే ప్రయాణాలు దేశంలో మళ్లీ ఊపందుకున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో గణనీయంగా పడిపోయిన ఫ్యామిలీ ట్రావెల్‌ గతేడాది 90 శాతం పెరిగింది. పరివార్‌తో కలిసి సందర్శించేందుకు ఎంపిక చేసుకునే నగరాల్లో టాప్‌–4లో హైదరాబాద్‌ నిలిచింది. పర్యాటకులకు వసతి సౌకర్యాలకు పేరొందిన ప్రముఖ సంస్థ ఎయిర్‌ బీఎన్‌బీ అధ్యయనం ఈ విశేషాలను వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌ బీఎన్‌బీ వేదికగా కుటుంబ ప్రయాణం గతేడాది 90 శాతం పెరిగిందని (ప్రపంచవ్యాప్త పెరుగుదలతో పోలిస్తే 30శాతం అధికం) దాదాపు 90,000 గమ్యస్థానాల్లో 15 మిలియన్లకు పైగా చెక్‌–ఇన్‌లు చోటుచేసుకున్నాయని ఈ స్టడీ తేల్చింది. గత ఏడాది కుటుంబ సమేతంగా టూర్లు వెళ్లడం పెరగడంతో పాటు తమ పెట్స్‌ను సైతం తమతో తీసుకువెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపించారు.

అందుకు అనుగుణంగా తగిన వసతి సౌకర్యాల కోసం అన్వేషించారని అధ్యయనం వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే అత్యధికంగా పెంపుడు జంతువులు గతేడాది 5 మిలియన్ల పైగానే ప్రయాణాల్లో భాగం పంచుకున్నాయి.

టాప్‌ 10 నగరాలివే
శవ్యాప్తంగా ప్రజలు కుటుంబాలతో కలిసి తమకు ఇష్టమైన పలు ప్రాంతాలకు ప్రయాణించారు. అలా చేసిన ప్రయాణాల్లో అత్యధికులు ఎంచుకున్న గమ్యస్థానాల్లో గోవా తొలి స్థానంలో నిలువగా ఆ తర్వాత స్థానంలో బెంగళూర్‌ పూణె, మన హైదరాబాద్‌, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ వరుసగా టాప్‌–5లో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్‌లోని జైపూర్‌, మహారాష్ట్రలోని రాయ్‌ఘర్‌, కేరళలోని ఎర్నాకులం, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం లోని నైనిటాల్‌ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని వార్తలు