కేంద్ర గెజిట్‌ ఆధారంగానే విచారించాలి

19 Oct, 2023 03:59 IST|Sakshi

సెక్షన్‌ 89 కింద విచారణ ఇక అసమంజసం

కృష్ణా ట్రిబ్యునల్‌–2కి స్పష్టం చేసిన తెలంగాణ

గెజిట్‌పై అధ్యయనానికి సమయం కోరిన ఏపీ

తదుపరి విచారణ నవంబర్‌ 22, 23కి వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌:     ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలను.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆధారంగానే ఇకపై కృష్ణా ట్రిబ్యునల్‌–2 విచారణ కొనసాగించాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్‌ 89లోని మార్గదర్శకాల ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలు జరిపేందుకు 2016 అక్టోబర్‌ నుంచి కృష్ణా ట్రిబ్యునల్‌–2 విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

అయితే కేంద్రం ఇటీవల అదనపు మార్గదర్శకాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో ఇకపై పాత మార్గదర్శకాల (సెక్షన్‌ 89) ఆధారంగా విచారణను కొనసాగించడం సమంజసం కాదని తెలంగాణ పేర్కొంది. కాగా బుధవారం ఢిల్లీలో సమావేశమైన జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఇరు పక్షాల వాదనలకు అవకాశం ఇచ్చింది.

కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం తక్షణమే విచారణను ప్రారంభించాలని తెలంగాణ తరçఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ సూచించారు. కొత్త గెజిట్‌పై ఏపీ తమ స్టేట్‌మెంట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించవచ్చని, విచారణను మాత్రం వాయిదా వేయరాదని కోరారు.

అధ్యయనానంతరమే వాదనలు: ఏపీ
గెజిట్‌ నోటిఫికేషన్‌కు ఉన్న చట్టబద్ధత, దాని ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు కొంత సమయం కేటాయించాలని, అధ్యయనం జరిపిన తర్వాతే తమ వాదనలు వినిపించగలమని ఏపీ న్యాయవాది జయదీప్‌ గుప్తా చెప్పారు. అప్పటివరకు విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని కూడా ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీలను తరలిస్తే, ప్రతిగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవచ్చని గోదావరి ట్రిబ్యునల్‌ వెసులుబాటు కల్పించింది. ఆ నీళ్లను సైతం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్‌–2కు కేంద్రం అప్పగించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశం మినిట్స్‌ను ఉటంకిస్తూ ఈ నీళ్ల కేటాయింపులను గోదావరి ట్రిబ్యునల్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌ తదుపరి విచారణను నవంబర్‌ 22, 23వ తేదీలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌కు ఉన్న చట్టబద్ధత, దాని ప్రభావాలపై తెలంగాణకు నవంబర్‌ 15లోగా, ట్రిబ్యునల్‌కు నవంబర్‌ 20లోగా తమ స్పందనను సమర్పించాలని ఏపీని ఆదేశించింది.  

మరిన్ని వార్తలు