కోమన్‌పల్లికి వీర జవాన్‌ మహేశ్‌ భౌతికకాయం

11 Nov, 2020 08:53 IST|Sakshi

ఏర్పాట్లు చేసిన యంత్రాంగం 

వేలాదిగా తరలి రానున్న ప్రజలు 

సాక్షి, నిజామాబాద్‌: ఇందూరు గడ్డపై జన్మించి.. దేశ సరిహద్దులో రక్షణ కవచమై నిలిచి ఉగ్రమూకల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వీర జవాన్‌ ర్యాడ మహేష్‌ పార్ధీవ దేహం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చేరుకొంది. ఆశ.. శ్వాస ఆర్మీనే అంటూ అయినవాళ్లకు దూరంగా ఉంటూ దేశ ఊపిరే తన ప్రాణంగా పిడికిలి బిగించి ఎదిరించిన మహేష్‌ విగతజీవిగా రావడంతో పురిటిగడ్డ ఘొల్లుమంది. సతీమణి సుహాసిని, తల్లిదండ్రులు రాజులు, గంగమల్లు కన్నీటి సంద్రమయ్యారు. కోమన్పల్లి చిన్నబోయింది.  

కాగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వీర జవాను ర్యాడ మహేశ్‌ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన కోమన్‌పల్లిలో జరగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. దేశ రక్షణలో ప్రాణాలొదిలిన మహేశ్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం మంగళవారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ రఘు ఆధ్వర్యంలో రెండు శాఖలకు చెందిన సిబ్బంది, స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంతిమయాత్ర, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్థానిక వైకుంఠధామాన్ని, అంతిమ యాత్ర సాగే రహదారులను పూర్తిగా శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు.  

భారీగా పోలీసుల మోహరింపు 
బుధవారం జరిగే మహేశ్‌ అంతిమ యాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులు భారీగా బలగాలను మోహరించారు. మంగళవారం సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్‌పల్లికి చేరుకున్నారు. అంతిమయాత్రకు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ ధర్వపురి అర్వింద్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం.   (ఉగ్ర పోరులో నిజామాబాద్‌ జవాన్‌ వీర మరణం)

మరిన్ని వార్తలు