ఎంఎఫ్‌ హుస్సేన్‌ ‘సినిమా ఘర్‌’.. ఇక ఫొటోలోనే.. 

13 Feb, 2021 09:01 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: సినిమాలు, కళలను అనుసంధానిస్తూ ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌.హుస్సేన్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 ప్రధాన రహదారిలో తన కలల సౌధంగా నిర్మించుకున్న సినిమా ఘర్‌ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఒక వైపు సినిమాలను, ఇంకోవైపు పెయింటింగ్స్‌ను తిలకిస్తూ కళాకారులు మురిసిపోయే విధంగా 1994లో ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఇక్కడ సినిమా ఘర్‌ పేరుతో తన సొంత ఆలోచనతో దీన్ని నిర్మించారు. అప్పటి బాలీవుడ్‌ అగ్రనటి మాధురి దీక్షిత్‌ చేతులమీదుగా ప్రారంభించారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు దీని నిర్వహణ వదిలేశారు. కోట్ల విలువ చేసే పెయింటింగ్స్‌ను ముంబైకి తరలించారు. పది సంవత్సరాల నుంచి ఈ భవనం శిథిలావస్థలోనే ఉంది. పదేళ్ల క్రితమే మళ్లీ తెరుస్తామని ప్రకటనలు వచ్చినప్పటికీ ఆ లోపే ఆయన 2011 జూన్‌ 9న మరణించడంతో మళ్లీ తెరుచుకోలేదు.

ఎంఎఫ్‌ హుస్సేన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ సినిమా పేరుతో కనువిందుగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. 50 మంది కూర్చొని సినిమా తిలకించే విధంగా సౌందర్య టాకీస్‌ పేరుతో ఇందులో మినీ థియేటర్‌ కూడా ఉండేది. ఇక పెయింటింగ్స్, బుక్స్, పోస్ట్‌కార్డుల ప్రదర్శన కోసం ప్యారిస్‌ సూట్‌ పేరుతో మరో హాల్‌ ఉండేది. తరచూ ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఇక్కడికి వచ్చి తన సన్నిహితులతో, కళాకారులతో సంభాషిస్తూ ఉండేవారు. ఆయన మరణం సినిమా ఘర్‌ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చివేస్తుంటే కళాభిమానులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఎంఎఫ్‌ హుస్సేన్‌ జ్ఞాపకాలు కళ్లముందే కూలిపోతుంటే ప్రతిఒక్కరూ చలించిపోతున్నారు. కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఈ భవనాన్ని తీసుకొని కళాకారుల సందర్శనార్థం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

మరిన్ని వార్తలు