‘ధరణి’కి ఎప్పట్లోగా పరిష్కారం?

5 Feb, 2023 04:51 IST|Sakshi

సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఈటల

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటిలోగా ప్రభుత్వం పరిష్కరిస్తుందో సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ధరణిలో 25 లక్షల మంది రైతులు దరఖాస్తులు పెట్టుకొని, తమ సమస్యలను గురించి ఎక్కడ చెప్పాలో తెలీక ఇబ్బందులు పడ్డారన్నారు. ధరణితో తలెత్తిన సాంకేతిక సమస్యలతో తమ భూములకు రైతుబంధు రాక పలువురు ఆత్మహత్యలకు పాల్పడితే, బీఆర్‌ఎస్‌ నేతలు సమస్యలను తేలిక చేసి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

మంత్రివర్గ ఉప సంఘం రిపోర్టు ఇచ్చినా కూడా భూముల సమస్యకు పరిష్కారం దొరకక రైతులు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో కేటీఆర్‌ సమాధానం తరువాత ఈటల మాట్లాడుతూ, రింగ్‌ రోడ్డు చుట్టుపక్కల దాదాపు 60 ఏళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన అసైన్‌మెంట్‌ భూములను లబ్ధిదారులకు కేవలం 300 గజాలు ఇచ్చి లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అసైన్డ్‌ భూములను ఇవ్వాలి కానీ గుంజుకునే ప్రయత్నం చేయొద్దని, ఈ విధంగా దళితుల కళ్లలో మట్టికొడుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

స్వయంగా ముఖ్యమంత్రే అసైన్డ్‌ భూములను అమ్ముకునే అవకాశం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని ఈటల గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్‌ తన వాగ్ధాటితో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చి, వాటిని ఇతరులపైకి విజయవంతంగా నెట్టివేశారని వ్యాఖ్యానించారు. ప్రధాని, కేంద్రాన్ని లక్ష్యంగా విమర్శలు చేసిన కేటీఆర్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పన్నులతో మాత్రమే నడుస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో పెట్రో ధరలు పెరిగాయని చెబుతున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌పై 35.2 శాతం పన్ను వేయడం లేదా అని ఈటల ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తున్నా ఇక్కడెందుకు తగ్గించలేదో చెప్పాలన్నారు. 

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు
పదవులు శాశ్వతం కాదని, ప్రజల గొంతునొక్కిన వారు కాలగర్భంలో కలిసిపోతారని  ఈటల ధ్వజమెత్తారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ, స్పీకర్‌ను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మంత్రి కేటీఆర్‌ తన వాగ్ధాటితో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారని, ఇవన్నీ నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీలను కూడా మాట్లాడించే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు